Tragedy: అల్లూరి జిల్లాలో వరుస విషాదాలు.. నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి..! series-of-water-accidents-in-alluri-district-death-of-children. |


Last Updated:

అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరుస దుర్ఘటనలు, పెదబయలు వద్ద ముగ్గురు బాలురు, మూలగుమ్మి జలపాతంలో ముగ్గురు బాలికలు మృతి, అధికారులు తల్లిదండ్రులకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక

News18
News18

అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరుసగా జరుగుతున్న విషాదకర ఘటనలు ప్రజలను కలవరపెడుతున్నాయి. పెదబయలు మండలం సికరి పంచాయతీలో జరిగిన తాజా ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మత్య గెడ్డలో చేపల వేటకు వెళ్లిన నలుగురు బాలుల్లో ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందడం గ్రామంలో శోకసంద్రాన్ని సృష్టించింది.

మృతులను కోడా ప్రదీప్ (9), పాంగి శ్రీను (10), జల్లుంగి అర్షిత్ (10)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో బాలుడిని స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి కాపాడగలిగారు. చిన్నారులు ఆటపాటలతో గడుపుతూ చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటన తరువాత గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

ఇదే జిల్లాలో తాజాగా జరిగిన విషాదకర ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన నలుగురు బాలికల్లో ముగ్గురు జారి పడిపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనలో అంజలి అనే బాలిక తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ఈ ఘటన జరిగి ఒక రోజు గడవక ముందే.. మరోసారి చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు తల్లిదండ్రుల్లో భయం కలిగిస్తున్నాయి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అన్న విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు సెలవుల సమయంలో చెరువులు, వాగులు, జలపాతాల వద్దకు అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. పిల్లలను ఇలాంటి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లనివ్వకుండా కచ్చితమైన నియంత్రణ అవసరమని చెబుతున్నారు. చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ రెండు ఘటనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *