Top 10 News: ప్రపంచవ్యాప్తంగా జరిగిన నేటి టాప్ 10 వార్తలు మీకోసమే.. ఇప్పుడే చూడండి |


మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ఏపీ క్యాబినెట్ సంతాపం ప్రకటించడమే కాకుండా, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

2. సీఎంలతో రేపు మోదీ సమావేశం

పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావంపై చర్చించేందుకు రేపు సాయంత్రం 6:30 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే త్రివిధ దళాధిపతులు , అఖిలపక్ష సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో, దేశ భద్రత, ఆర్థిక సుస్థిరతపై రాష్ట్రాలను సమన్వయం చేసేందుకు ప్రధాని చేపట్టనున్న ఈ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

3. తెలంగాణలో పెట్రోల్‌, ఎల్పీజీ కొరత లేదు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఇంధన నిల్వలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరణ ఇచ్చిన ఆయన, బంకుల వద్ద అనవసర రద్దీని తగ్గించాలని కోరుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భరోసా ఇచ్చారు.

4. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు..

దేశంలో పెట్రోలో ధరల మోత మొదలైంది. అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ.. లీటర్ పెట్రోల్‌పై రూ. 5.30, డీజిల్‌పై రూ. 3 పెంచుతూ వాహనదారులకు భారీ షాకిచ్చింది. ఈ ధరల పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.64కు, డీజిల్ ధర రూ. 98.64కు చేరి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపింది. రానున్న రోజుల్లో మిగతా కంపెనీలు కూడా రేట్లు పెంచుతాయనే ఆందోళన నెలకొంది.

5. వైన్ షాపులకు దేవుళ్ల పేర్లు తొలగించాలి

మద్యం దుకాణాలకు హిందూ దేవతల పేర్లు పెట్టడంపై నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ ధోరణి హిందూ దేవుళ్ల పట్ల అగౌరవమని మండిపడ్డారు. ఇతర మతాల దేవుళ్ల పేర్లు ఇలా వాడటం లేదని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మద్యం షాపులకు దైవ నామాలు పెట్టకుండా కఠినమైన చట్టం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

6. కల్తీ పాల ఘటన..

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 17 మంది మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మానవ హక్కుల కమిషన్, దీనిని సుమోటోగా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై రెండు వారాల్లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీలను ఆదేశించింది.

7. కల్తీ ఐస్ క్రీమ్‌

ముషీరాబాద్ బాపూజీ నగర్‌లో అనుమతులు లేకుండా, నాణ్యత లేని పదార్థాలతో కల్తీ ఐస్ క్రీమ్‌లు తయారు చేస్తున్న కేంద్రంపై హెచ్-ఫాస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 1.75 లక్షల విలువైన కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిర్వాహకుడు అశోక్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

8. ఇరాన్‌ నేవీ చీఫ్‌ మృతి!

హర్మూజ్ జలసంధి సమీపంలోని బందర్ అబ్బాస్ నగరంపై జరిగిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలీరెజా హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది, ఇది యుద్ధ వాతావరణంలో కీలక పరిణామంగా మారింది. హర్మూజ్ జలసంధి దిగ్బంధనంలో ఈయన ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో, ఈ పరిణామం ఆ ప్రాంతంపై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.

9. రామ్‌ చరణ్‌ కంటికి సర్జరీ..

‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్ కనురెప్పకు వైద్యులు అత్యంత నైపుణ్యంతో శస్త్రచికిత్స పూర్తి చేశారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆపరేషన్ సమయంలో తమలో కలిగిన ఆందోళనను పోగొట్టి, ధైర్యాన్ని నింపిన వైద్య బృందానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

10. వారిపై కఠిన చర్యలు..

‘ధురంధర్ 2’ చిత్రంపై సోషల్ మీడియాలో ఏఐ (AI) సాయంతో సృష్టించిన మార్ఫింగ్ ఫోటోలు, తప్పుడు ప్రచారాలను దర్శకుడు ఆదిత్య ధర్ తీవ్రంగా ఖండించారు.ఈ చిత్రంలోని హంజా (జస్క్రీత్) పాత్ర తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది పూర్తిగా అబద్ధం. సిక్కు పాత్రలను కించపరిచేలా ఉన్న ఆ ఫోటోలకు తమ సినిమాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *