ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు, అప్పుల వడ్డీరేట్లను తగ్గించి రూ.1,658 కోట్ల ఆదా సాధిస్తామని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్లు, కేంద్ర పథకాల నిధులు విడుదల చేసి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించామని, పెట్టుబడులకు అనుకూల పరిసరాలు, పరిపాలన సౌకర్యాలు సృష్టించినట్లు తెలిపారు. కొత్త విధానాలు, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, స్టార్టప్, పర్యాటక రంగాల సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని స్థిర, పెట్టుబడులకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
రాష్ట్రానికి తక్కువ ఆదాయం, ఎక్కువ ఖర్చుల సమస్యల మధ్య మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు సీఎం చంద్రబాబు, రెండుమూడేళ్లలో ఇంకా బలోపేతమైన బడ్జెట్ అందిస్తామన్నారు. కేంద్ర సహకారంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, అమరావతి అభివృద్ధి, రోడ్డు అనుసంధానం, హార్టీకల్చర్ హబ్‌కు రూ.30వేల కోట్లు కేటాయించామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30కిపైగా మున్సిపాలిటీలు గెలుస్తామని భావించినప్పటికీ కొంత తగ్గిందన్నారు. కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదని, కరీంనగర్, నిజామాబాద్ మినహా బీజేపీ ప్రభావం పెద్దగా లేదన్నారు కేటీఆర్. సింగరేణి కార్మికులకు మద్దతుగా కొత్తగూడెంలో సీపీఐకు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కారణమన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత . బీఆర్ఎస్ కొన్ని చోట్ల మూడో, నాలుగో స్థానాల్లో పడిపోయిందని, కేడర్‌ను పూర్తిగా వదిలిపెట్టిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సింగరేణిలో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు.
ఈశాన్య భారత రాష్ట్రం అస్సాంలోని దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారిపై 4.2 కి.మీ పొడవైన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మించగా, ప్రధాని మోదీ విమానం అక్కడ ల్యాండ్ అయింది. ఈ రన్‌వే చైనా సరిహద్దుకు సుమారు 300 కి.మీ, మయన్మార్‌కు 200 కి.మీ దూరంలో ఉండి సైనిక సంసిద్ధత, విపత్తు సహాయ చర్యలు, అత్యవసర మోహరింపులకు కీలకంగా మారింది. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సదుపాయంపై Indian Air Forceకు చెందిన రఫేల్, సుఖోయ్, సీ17 గ్లోబ్‌మాస్టర్ యుద్ధవిమానాలు ట్రయల్ రన్స్ నిర్వహించాయి.
భారత సైన్యం మాజీ అధిపతి మేజర్ ముకుంద్ నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం రాజకీయ వివాదానికి దారితీసింది. దీంతో మిలిటరీ అధికారులు , ఉన్నత పదవుల్లో పనిచేసినవారి పుస్తకాలపై కేంద్రం కొత్త నియమాలు తీసుకురావాలని ఆలోచిస్తోంది.పదవీ విరమణ తర్వాత ఇరవై సంవత్సరాల వరకు వారి రచనలు ప్రచురించకుండా నిరీక్షణ కాలం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నటుడు ధనుష్‌కు లీగల్ నోటీసులు అందాయి. చిత్ర నిర్మాణసంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ ఒప్పందం చేసిన ‘నాన్ రుద్రన్’ చిత్రం పూర్తి చేయకపోవడంతో రూ.20 కోట్లు నష్టపరిహారం కోరింది. దీనిపై కోర్టు నోటీసులు పంపింది. ఈ సినిమా కథ పూర్తి అవ్వకపోవడం, షూటింగ్‌కు ధనుష్ హాజరుకాకుండా ఇతర సినిమాలకు సంతకాలు చేస్తున్నారని ఆ సంస్థ ఆరోపిస్తోంది.
తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై నటి మృణాల్ స్పందించింది. సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటానని ఆమె స్పష్టం చేసింది. ఫిబ్రవరి 14న పెళ్లి జరుగుతుందన్న వార్తలపై హాస్యంగా స్పందిస్తూ,ఒకవేళ పెళ్ళి కుదిరితే తానే స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌కు పాకిస్థాన్ రెడీగా ఉందన్నారు కెప్టెన్ సల్మాన్ అఘా . జట్టులోని ప్రతి ఒక్కరిదీ కీలక పాత్రేనని, తారిఖ్, బాబర్ అజామ్ ప్రదర్శనపై ఆందోళన లేదన్నారు. . ‘‘ప్రపంచ కప్ టోర్నీల్లో మాకు భారత్‌పై మంచి రికార్డు లేదు. గత చరిత్రను మేం మార్చలేం. అయితే, ఈసారి తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. వారు ఇస్తే తప్పకుండా మేమూ కూడా షేక్‌హ్యాండ్ ఇస్తాంమని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కరోలైనాలోని ఫోర్ట్ బ్రాగ్ ఆర్మీ బేస్‌లో జరిగిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమెరికా సైనిక శక్తిని హైలైట్ చేస్తూ ఇరాన్, చైనాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న క్లిష్టమైన అణు చర్చల నేపథ్యంలో, అవసరమైతే భయమే శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా ప్రయోజనాలకు ముప్పు ఏర్పడితే, అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


