Tirupati: డబ్బులిస్తేనే శవాన్ని ఇస్తాం.. తిరుపతిలో ఏంటీ దారుణం | ట్రెండింగ్


Last Updated:

Hospital Controversy: సమాజంలో అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. ఇప్పటి వరకు ట్రీట్‌మెంట్ పేరుతో రోగి బంధువుల్ని పీడించుకున్న సంఘటనలు కొన్ని వేల కేసుల్ని చూశాం.

+

Tirupati

Tirupati hospital controversy

Hospital Controversy: సమాజంలో అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. ఇప్పటి వరకు ట్రీట్‌మెంట్ పేరుతో రోగి బంధువుల్ని పీడించుకున్న సంఘటనలు కొన్ని వేల కేసుల్ని చూశాం. కాని మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో హాస్పిటల్ బిల్లు కోసం మృతదేహాన్ని కూడా వదిలిపెట్టలేదు ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం. మానవత్వాన్ని మరిచిపోయే ఘటన తిరుపతిలోని రమాదేవి ప్రైవేట్ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది.

డబ్బుల కోసం శవాన్ని..

కార్పొరేట్ వైద్యుల కాసుల కక్కూర్తి పరాకాష్టకు చేరింది. ప్రాణాలు పోస్తారనే నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రులను కాదనుకొని ప్రైవేట్ హాస్పిటల్‌కి వచ్చే రోగులకు ట్రీట్‌మెంట్ పేరుతో కొందరు ప్రాణాలు తీస్తుంటే మరికొందరు ప్రాణాలు పోయిన శవాల్ని కూడా తమ ఫీజుల కోసం వదలిపెట్టడం లేదు. తాజాగా తిరుపతిలోని రమాదేవి ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది కూడా చికిత్స పేరుతో ఇప్పటికే లక్షల రూపాయలు వసూలు చేసినప్పటికీ పేషెంట్ మరణించాడు. అయితే చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇవ్వాలంటే డబ్బులు చెల్లించాలని లేకపోతే ఇవ్వబోమంటూ ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి బిల్లులు పూర్తిగా చెల్లించాలంటూ మృతదేహాన్ని నిలిపివేయడం కుటుంబ సభ్యులను మరింత దుఃఖంలోకి నెట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

ప్రైవేట్ ఆసుపత్రి తీరుపై విమర్శలు..

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జీడిమాకులపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురవడంతో తొమ్మిది రోజుల క్రితం తిరుపతిలోని రమాదేవి ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స కోసం ఇప్పటికే సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ డబ్బులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, శ్రీనివాస్ భార్య , తల్లి తమ బంగారు మంగళసూత్రాలను కూడా తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చినట్లు తెలిపారు. అయితే చికిత్స పొందుతూ శ్రీనివాస్ మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించగా ఇంకా రూ.45 వేల రూపాయలు బాకీ ఉన్నాయని చెప్పి మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరించినట్లు వారు ఆరోపిస్తున్నారు.

మృతదేహం కోసం బంధువుల రోదన..

ఇప్పటికే తమ దగ్గర ఉన్నంత డబ్బు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తామని వేడుకున్నప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం కనీసం మానవత్వం చూపలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన రాలేదని వారు అంటున్నారు. ఇక పలమనేరు ఎమ్మెల్యే కూడా ఫోన్ ద్వారా ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మృతదేహాన్ని అప్పగించాలని కోరినప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరకు డబ్బులు చెల్లించకపోతే మృతదేహాన్ని ఇవ్వబోమంటూ ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల దందాను అరికట్టాలని, బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *