Tirumala Akshara Govindam: భక్తులకు శుభవార్త.. బాసర తరహాలోనే ఇకపై తిరుమలలో అక్షర గోవిందం |


Last Updated:

Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర మాత్రమే అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా చేపట్టవచ్చు.

Tirumala Akshara Govindam
Tirumala Akshara Govindam

Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో చేసేవారు. అటుపై సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌లో ఉన్న శ్రీవిద్యా సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల సమీపంలోని పేరూరులో కూడా ‘అక్షర గోవిందం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాసర ఆలయం తరహాలోనే పైలట్ ప్రాజెక్టుగా వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్షరాభ్యాసం తర్వాత ఏడు వస్తువులతో ప్రత్యేక కిట్ పంపిణీ చేస్తారు. అందులో పలక, బలపాల పెట్టె, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు-సరస్వతి-శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటం, కంకణాలు, పటికబెల్లం ప్రసాదం ఉంటాయి.

ఇక ఏపీలో బాసర..

పిల్లలకు మంచి విద్యాబుద్దులు ప్రసాదించాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకే వాళ్ల జీవితానికి మంచి మార్గం వేసేందుకు అక్షరాభ్యాసాన్ని చదువుల తల్లిగా కొలిచే సరస్వతి ఆలయంలో చేస్తారు. అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయం పిల్లల అక్షరాభ్యాసాలకు చాలా ఫేమస్. అయితే తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు వారి పిల్లలకు అక్షరాభ్యాసం కూడా వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జరగాలని భావించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన విజ్ఞప్తి మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఈ ‘అక్షర గోవిందం’ ప్రాజెక్టును రూపొందించింది. మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు.

అక్షరాభ్యాసలకు..

అయితే పేరూరులో వకుళమాత ప్రధాన ఆలయంలో ఇకపై అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉండటంతో భక్తులు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.ఈ నూతన మండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడే చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు.

పైలెట్ ప్రాజెక్ట్..

తొలుత ఈ కార్యక్రమాన్ని 300 కిట్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ కిట్లను ఉచితంగా అందించాలా? లేక నామమాత్రపు రుసుము వసూలు చేయాలా? అనే విషయంపై టీటీడీ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. హెచ్‌డీపీపీ లేదా ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *