Tiger: ఆ శివాలయంలో పెద్దపులి.. భయంతో వణికిపోతున్న గ్రామస్తులు.. అధికారులు అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం భయాందోళనలు రేపుతోంది. Sri Veera Venkata Satyanarayana Swamy Temple సమీపంలో కనిపించిన ఈ పులి, గ్రామాల్లో సంచరిస్తోంది.

+

అన్నవరం

అన్నవరం కు 20 కిలోమీటర్ల దూరంలో అందరూ చూస్తుండగా రోడ్డు దాటిన పెద్దపులి

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఈ పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పట్టపగలు రోడ్డును దాటుతూ కనిపించిన ఈ పులిని చూసిన స్థానికులు, అధికారులు సైతం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటివరకు ఒక జిల్లాలో సంచరిస్తూ దాడులు చేసిన ఈ పెద్దపులి తాజాగా మరో జిల్లాలోకి ప్రవేశించి అక్కడ కూడా లేగ దూడలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటోంది. దీంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు స్థానికులను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈ పెద్దపులి మెడలో జియో ట్యాగ్ అమర్చిన కెమెరా ఉండటంతో దాని కదలికలను అటవీశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో అది ఎక్కడ సంచరిస్తోంది అనే సమాచారం అధికారులకు స్పష్టంగా అందుతోంది. అయినప్పటికీ గ్రామాల సమీపానికి రావడం వల్ల స్థానికుల్లో భయం నెలకొంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోనే ఈ పెద్దపులి ప్రయాణం కొనసాగుతుండగా, తాజాగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన Sri Veera Venkata Satyanarayana Swamy Temple సమీపంలో ఈ పులి తలదాచుకున్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. రాత్రి వేళలో సమీపంలోని ఒక శివాలయం వద్ద పులి గాండ్రింపులు వినిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు.

అన్నవరం దేవస్థానానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంఖవరం మండలం పరిధిలోని బూరుగువాక గ్రామ సమీపంలో ఈ పెద్దపులి రోడ్డు దాటుతూ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. నీటి కాలవ మార్గం ద్వారా శంఖవరం మండలం గౌరమ్మపేట పంచాయతీ పరిధిలోని మాసంపల్లి, రాజవరం గ్రామాల జీడిమామిడి తోటల్లోకి ఈ పులి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శంఖవరం మండలంలో ఒక లేగ దూడను చంపి ఆహారంగా తీసుకున్నట్లు సమాచారం ఉండటంతో గ్రామాల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.

ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న ఈ పెద్దపులి ప్రత్తిపాడు వైపు ప్రయాణిస్తే పాండవులపాలెం, గజ్జన్నపూడి, శరభవరం, ఉత్తరకంచి, ఒమ్మంగి గ్రామాల వ్యవసాయ పొలాల గుండా వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు శంఖవరం మండలం వైపు నుంచి ప్రయాణం కొనసాగితే మాసంపల్లి, గౌరమ్మపేట, శృంగధార, పెద్ద మల్లాపురం గ్రామాల మీదుగా సంచారం కొనసాగవచ్చని భావిస్తున్నారు. దీంతో ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఈ పులి కదలికలపై నిశితంగా నిఘా పెట్టారు. సాధారణంగా ఆహారం కోసం మాత్రమే ఇది దూడలను వేటాడుతుందని, ప్రజలపై దాడి చేసే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ సాయంత్రం తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాల వైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం అన్నవరం సమీపంలోని శంఖవరం పరిధిలో ఒక తోటలో ఈ పెద్దపులి తలదాచుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత మళ్లీ ఇది సంచారం ప్రారంభించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *