Last Updated:
శ్రీకాళహస్తి ఆలయంలో అదనపు వసూళ్ల ఆరోపణల వీడియో వైరల్ కాగా, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వాటిని ఖండించి కేసులు నమోదు చేసింది.
శ్రీకాళహస్తి ఆలయాన్ని చుట్టుముట్టిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆలయంలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా రూ.200 టికెట్‌తో క్యూలైన్లోకి వెళ్లే భక్తుల వద్ద సెక్యూరిటీ సిబ్బంది అదనంగా రూ.50 తీసుకుంటున్నారని, అలాగే సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్లలో రూ.5 బదులుగా రూ.10 వసూలు చేస్తున్నారని పేర్కొంటూ ఓ మహిళ విమర్శల కు దారితీసింది.
ఈ వీడియోను వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వేదికలు పంచుకోవడంతో ఇది మరింత వైరల్ అయింది. ఆలయానికి వచ్చే భక్తులు మోసపోవద్దని హెచ్చరిస్తూ చేసిన ఈ పోస్టులు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. దోష నివారణ కోసం వచ్చే పవిత్ర క్షేత్రంలోనే కొందరు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం భక్తుల్లో అసంతృప్తిని పెంచుతోంది.
ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తీవ్రంగా ఖండించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ దేవస్థానం పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా ఒక మహిళ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు అసత్యమని స్పష్టం చేస్తూ, ఆమెపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది.
భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భక్తులు సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని దేవస్థానం కోరింది. ఈ పరిణామాల మధ్య, భక్తుల ప్రయోజనాల కోసం పారదర్శక వ్యవస్థ అవసరమనే చర్చ మరింత బలపడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


