కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మహేష్‌కు 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, అప్పట్లో పెద్ద స్టెంట్ కూడా వేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. పల్స్ రేటు 130-140 దాటితే ప్రమాదమని హెచ్చరించారని పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితిలో తన కుమారుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటాడని ఆయన ప్రశ్నించారు. మహేష్ డ్రగ్స్ తీసుకోలేదని టెస్టుల్లో కూడా తేలిందని తెలిపారు. సాధారణంగా డ్రగ్స్ తీసుకున్నవారి పల్స్ రేటు 150 నుంచి 200 మధ్య ఉంటుందని, కానీ మహేష్ పల్స్ రేటు అంతగా లేదని చెప్పారు. ఫాంహౌస్ పార్టీ సమయంలో మహేష్ పల్స్ రేటు 97గా నమోదైందని వెల్లడించారు.
బ్లడ్ శాంపిల్స్ రిపోర్టులు రావడానికి సాధారణంగా 48 గంటలు పడుతాయని, అయితే ఈ కేసులో వెంటనే రిపోర్టులు ఎలా వచ్చాయో ప్రశ్నించారు. తాము ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించుకున్నప్పుడు 48 గంటలలోపు రిపోర్టులు రాలేదని గుర్తుచేశారు. యూరిన్ శాంపిల్స్ ఫలితాలు కూడా మొదటిసారి 10 నిమిషాల్లో, రెండోసారి 5 గంటల్లో వచ్చినట్లు చెప్పారు.
ఈ పరిణామాలను బట్టి మధ్యలో ఏదో తేడా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ రిపోర్టుల్లో పాజిటివ్‌గా వచ్చిన పదార్థాలు సాధారణ మందులు వాడినా కనిపించే అవకాశం ఉందని, వాటిని ఆధారంగా చేసుకుని డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపించడం సరైంది కాదన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక అన్ని ఆధారాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తామని పుట్టా సుధాకర్ తెలిపారు. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానానికి కూడా పూర్తి వివరాలు ఇచ్చామని, ఇకపై వారు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు.


