Last Updated:
కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2026-27 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లాలో 20 పాఠశాలల్లో 6వ, 11వ తరగతుల్లో 1600 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అమరావతి రాష్ట్ర పథక సంచాలకులు ప్రకటన విడుదల చేసినట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి జి. అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలోని బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ ప్రవేశాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లాలో మొత్తం 20 టైప్-3 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఈ విద్యాలయాల్లో 6వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10 మరియు 12వ తరగతులలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలోని ఈ 20 విద్యాలయాల్లో 6వ మరియు 11వ తరగతుల్లో కలిపి సుమారు 1600 సీట్లకు అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇతర తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా ఈ ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ ప్రవేశాలకు అనాథ బాలికలు, బడి బయట ఉన్న బాలికలు, చదువు మధ్యలో మానేసిన డ్రాపౌట్లు, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల బాలికలు అర్హులు. అలాగే వలస కార్మికుల కుటుంబాలకు చెందినవారు, తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న కుటుంబాల బాలికలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,20,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.1,44,000 లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో బాలికతో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు ఫోన్ నంబర్ అవసరమని తెలిపారు. ఆసక్తి గల బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దగ్గరలోని కేజీబీవీ పాఠశాలను సంప్రదించినా అక్కడి సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేయడంలో సహాయం చేస్తారని అధికారులు చెప్పారు. అర్హులైన బాలికలు ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సమగ్ర శిక్ష అనకాపల్లి కార్యాలయాన్ని 9550784829 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



