Last Updated:
Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఆందోళనతో సహాయం చేయకుండా వెళ్లిపోతారు.
Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఆందోళనతో సహాయం చేయకుండా వెళ్లిపోతారు. అయితే ఇప్పుడు అలాంటి భయాలకు తెరదించుతూ ప్రమాద బాధితులను కాపాడే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు రక్షిస్తే రహవీర్ బిరుదుతో పాటు రూ.25 వేల నగదు బహుమతి ఇస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.
రహవీర్ లేదా గుడ్ సామరిటన్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆసుపత్రికి చేరిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కీలక సమయంలో స్పందించిన పౌరులను గుర్తించి ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు వివరించారు. ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి రూ.25 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తారు. అంతేకాదు దేశవ్యాప్తంగా టాప్-10 రహవీర్లను ఎంపిక చేసి ప్రత్యేకంగా రూ.1 లక్ష నగదు, ట్రోఫీ, ప్రశంసాపత్రం కూడా ప్రదానం చేస్తారు. ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు ఈ బహుమతిని పొందే అవకాశం ఉందని తెలిపారు.
ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారిని పోలీసులు ఇబ్బంది పెట్టరని, కోర్టులకు తిరగాల్సిన అవసరం లేకుండా గుడ్ సామరిటన్ మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో కూడా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, గుర్తుతెలియని వాహనం ఢీకొని మరణిస్తే రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుందని చెబుతున్నారు.
జిల్లా ఇంచార్జి కలెక్టర్ Garima Agrawal రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అధిక వేగం, హెల్మెట్ లేకపోవడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక కాల్, ఒక సహాయం, ఒక నిర్ణయం — ఒక ప్రాణాన్ని కాపాడగలదని గుర్తుంచుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.”
Hyderabad,Telangana



