Last Updated:
Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. SIT నివేదికలో 20.10 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత పాలకుల హయాంలో ప్రణాళికాబద్ధంగా పెద్ద కుట్రే జరిగిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో భక్తులకు పంపిణీ చేసిన సుమారు 48.76 కోట్ల లడ్డూలలో ఏకంగా 20.10 కోట్ల లడ్డూలను పాలు లేకుండా రసాయనాలతో సృష్టించిన నకిలీ నెయ్యితోనే తయారు చేశారని సిట్ దర్యాప్తులో వెల్లడైన సంచలన నిజాలను సభ ముందు ఉంచారు. సుమారు 11 కోట్ల మంది భక్తులు ఈ కల్తీ లడ్డూలను ప్రసాదంగా స్వీకరించారని, ఇది అత్యంత తీవ్రమైన నేరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడి ప్రసాదాన్ని సైతం వదలకుండా అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈ మహా పాపానికి కారణమైన దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించి తీరుతుందని స్పష్టం చేశారు.
నెయ్యిలో నెయ్యే లేదని తేలింది.
రసాయనాల నుంచి నెయ్యి తీయొచ్చని చూపించారుతిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభ మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ pic.twitter.com/P6uB9oHjrx
— ChotaNews App (@ChotaNewsApp) February 24, 2026
అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక జరిగిన కుట్ర కోణాన్ని వివరించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తొలుత నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) నివేదిక ఇవ్వగా, అసలు అందులో నెయ్యే లేదని సీబీఐ నేతృత్వంలోని సిట్ (SIT) విచారణలో తేలిందన్నారు. తమకు నచ్చిన, బినామీ సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు గత ప్రభుత్వం టెండర్ నిబంధనలను ఇష్టారీతిన మార్చేసిందని ఆరోపించారు.
నెయ్యి సరఫరా సంస్థకు ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్‌ను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారని, డెయిరీ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాదికి కుదించారని మండిపడ్డారు. ఇలా అర్హతలు లేని సంస్థలను ఎంపిక చేసి భోలే బాబా అనుబంధ సంస్థలైన మాల్ గంగా, వైష్ణవి డెయిరీల ద్వారా ఒక్క చుక్క పాలు కూడా వాడకుండా నెయ్యి పేరుతో రసాయనాలను సరఫరా చేయించారని పవన్ వివరించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూలు కూడా ఈ కల్తీ నెయ్యితో చేసినవే కావడం బాధాకరమన్నారు.
హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ భాష, కులం, ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. అలా చేయకపోతే ఇలాంటి అపచారాల పరంపర కొనసాగుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర మతాలకు సంబంధించి ఇలాంటి పరిణామం జరిగితే దేశం మొత్తం గగ్గోలు పెట్టేవారని, కానీ హిందువుల పట్ల ఆ పట్టింపు కరువైందన్నారు.
ఇతర మతాల గురించి మాట్లాడితే ఓట్లు పోతాయని, హిందువుల గురించి మాట్లాడటం తేలిక అన్న ధోరణి మారాలని సూచించారు. కల్తీ జరిగిందని ఆధారాలతో సహా చూపుతున్నా, గత పాలకులు బుకాయిస్తుండటం శోచనీయమన్నారు. ఈ మహా అపచారానికి గత టీటీడీ పాలకమండలితో పాటు వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వ పెద్దలే పూర్తి బాధ్యత వహించాలని పవన్ తేల్చిచెప్పారు.
దేవాలయాల నిర్వహణ, నిధుల వినియోగంపై పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని 218వ పద్యాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. రాజు కోసం వసూళ్లు చేసేవారికి దేవాలయాలపై అధికారం ఇవ్వకూడదని, అలా ఇస్తే రాజ్యానికి ఆర్థిక నష్టం వచ్చినప్పుడల్లా దేవుడి సొమ్మును వారు రాజు ఖజానాకు చేరుస్తారని ఆ పద్యం సారాంశాన్ని వివరించారు. గత ఐదేళ్ల పాలనలో సరిగ్గా ఇదే జరిగిందని విమర్శించారు.
భక్తులు తమ కర్మలను పోగొట్టుకోవడానికి దేవుడికి కానుకలు సమర్పిస్తారని, అలాంటి భగవంతుడి డబ్బును దోచుకునే వారి తరాలు లేచిపోతాయని పవన్ హెచ్చరించారు. ఈ కేసును ఎంత సాగదీస్తే వారి పాపం అంత పెరుగుతుందని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ వేగవంతం చేసి, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



