Nara Lokesh: గోదావరిలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల జలసమాధి.. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

Nara Lokesh: వరుస సెలవులు రావడంతో అమరావతిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న మిత్రబృందం భద్రాచలం పర్యటనకు వెళ్లారు. ఉగాది సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, సరదాగా సమయం గడిపేందుకు పోలవరం జిల్లా ఎటపాక, కుక్కునూరు మండలాల మధ్య ఉన్న గోదావరి రేవుకు చేరుకున్నారు. నది ఒడ్డున ఫోటోలు దిగుతూ, నీటిలో కేరింతలు కొడుతున్న సమయంలో ఊహించని ప్రమాదం సంభవించింది. దాంతో ఏడుగురు నదిలో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు నది ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘పురుషోత్తపట్నం సమీపంలోని గోదావరి నది వద్ద జరిగిన విషాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. నదిలోకి దిగిన సమయంలో బలమైన నీటి ప్రవాహానికి ఏడుగురు బి.టెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇది తీరని లోటు, ఈ తీవ్ర దుఃఖాన్ని తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని ఆయా కుటుంబాలకు ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంది. అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుంది’

మిత్రుడిని కాపాడబోయి.. అందరూ కలిసి

నదిలో దిగిన ఆరుగురు మిత్రుల్లో ఒకరు ప్రమాదవశాత్తు లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగిపోతుండగా, పక్కనే ఉన్న మరో మిత్రుడు అతడిని కాపాడేందుకు చేయి అందించారు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ కొట్టుకుపోవడం మొదలుపెట్టారు. వారిని రక్షించే క్రమంలో మిగిలిన వారు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందుకు వెళ్లారు. దురదృష్టవశాత్తు నీటి సుడిగుండంలో చిక్కుకుని ఆరుగురూ మునిగిపోయారు. వీరిలో ఒకరికి ఈత రావడంతో అతి కష్టమ్మీద ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు.

చనిపోయిన విద్యార్థుల వివరాలు

దగ్గుపాటి నవదీప్: పామర్రు మాజీ ఎంపీపీ ఫణింద్రనాథ్ ఏకైక కుమారుడు. తల్లిదండ్రులకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది.

చారుగుండ్ల శ్రీకర్: భద్రాచలానికి చెందిన శ్రీకర్, అమరావతిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తన సొంత ఊరిలోనే మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది.

పొడిచేటి అభిరామ్: భద్రాచలం నివాసి అయిన అభిరామ్, తన మిత్రులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు వదిలాడు.

తేజస్వి సాయి, సతీష్ కుమార్: వీరిద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తేజస్వి సాయి తండ్రి దక్షిణ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తుండగా, కొడుకు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు.

తీరని లోటు

ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు అవుతారనుకున్న బిడ్డలు, ఇలా విగతజీవులుగా ఇంటికి చేరడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. “స్నేహంలో మునిగారు.. కన్నీటిలో కరిగారు” అంటూ వారి మైత్రీ బంధాన్ని తలచుకుని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. నదుల వద్దకు వెళ్లేటప్పుడు యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీటి లోతు తెలియకుండా దిగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *