Murder Mystery: చిత్తూరులో చీటీల వ్యాపారి దారుణ హత్య! మూడు రోజుల తర్వాత అడవిలో శవమై కనిపించిన మహిళ | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారి చంద్రమ్మను అప్పు వివాదంపై సుబ్రహ్మణ్యం సహచరులతో కలిసి జగమర్ల అటవీలో హత్య, బంధువుల ధర్నాతో జాతీయ రహదారి ట్రాఫిక్ నిలిచింది

+

చిత్తూరు

చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారం కొనసాగిస్తున్న  మహిళ  దారుణ హత్య

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడగడమే ఆ మహిళ చేసిన పాపమైంది. నమ్మించి తీసుకెళ్లి, అతి కిరాతకంగా ప్రాణాలు తీసిన ఘటన పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది. చీటీల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చంద్రమ్మ అనే మహిళ హత్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే..

పెద్ద పంజాని మండలం, ఎగువ మిద్దెపల్లి గ్రామానికి చెందిన చంద్రమ్మ (35) సుమారు 15 ఏళ్ల క్రితం వి.కోట మండలానికి చెందిన చలపతి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, కుటుంబ కలహాల కారణంగా వీరిద్దరూ ఆరేళ్ల క్రితమే విడిపోయారు. అప్పటి నుంచి చంద్రమ్మ పెద్ద పంజానిలో ఉంటూ టైలరింగ్ చేస్తూ, మరోవైపు చీటీల వ్యాపారం నిర్వహిస్తూ స్వశక్తితో జీవిస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడికి లక్ష రూపాయల వరకు అప్పు ఇచ్చింది.

గత శనివారం నుంచి చంద్రమ్మ కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన బంధువులు సోమవారం పెద్ద పంజాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా, గ్రామస్తులు కీలక సమాచారం ఇచ్చారు. చంద్రమ్మ చివరిసారిగా సుబ్రహ్మణ్యం అనే యువకుడితో కలిసి బైక్ మీద వెళ్లినట్లు వారు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది. జగమర్ల అటవీ ప్రాంతంలో చంద్రమ్మను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

పోలీసులు నిందితుడు చూపిన గుర్తుల ఆధారంగా పలమనేరు-చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న జగమర్ల అటవీ ప్రాంతంలో గాలించగా, చంద్రమ్మ మృతదేహం రక్తపు మడుగులో కంటపడింది. మృతదేహంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో, నిందితులు అత్యంత క్రూరంగా దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలో సుబ్రహ్మణ్యంతో పాటు మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు సమాచారం అందడంతో, వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మృతురాలి మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో చంద్రమ్మ బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై జగమర్ల వద్ద బైఠాయించి భారీ ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితుడు సుబ్రహ్మణ్యం మృతురాలికి సమీప బంధువే అని, నమ్మకంతో అప్పు ఇస్తే ఇలా ప్రాణాలు తీశాడని చంద్రమ్మ తమ్ముడు కన్నీరుమున్నీరయ్యాడు.

ప్రాథమిక విచారణ ప్రకారం, లక్ష రూపాయల అప్పు తిరిగి చెల్లించలేక, ఆ గొడవ నుంచి తప్పించుకోవడానికే సుబ్రహ్మణ్యం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ హత్య వెనుక ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక మహిళను ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి చంపడం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఒక చిన్న మొత్తం కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారుతున్నాయో చెప్పకనే చెబుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *