KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Rapid Read
కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం
కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్ ప్రాంగణంలో జరిగిన ఒక విషాదకర సంఘటన ఆసుపత్రిలో ఉన్న భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపింది. ఆసుపత్రి పర్యవేక్షణ ఎంత బలహీనంగా ఉందో ఈ ఘటన నిరూపిస్తోంది.

కేజీహెచ్ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న లిఫ్ట్ పక్కన ఒక అనుమానాస్పద బ్యాగు కనిపించింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఈగలు ముసరడం, దుర్వాసన రావడంతో అక్కడి సిబ్బందికి అనుమానం కలిగింది. భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి ఆ బ్యాగును తెరిచి చూడగా, అందులో ఒక శిశువు మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించడంతో అందరూ నివ్వెరపోయారు. ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రాంతంలో, అది అధికారుల కార్యాలయాల వద్దే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

కేజీహెచ్‌ను ప్రతి నిత్యం వందలాది సిసి (CC) కెమెరాలు పర్యవేక్షిస్తుంటాయి. మరి ఈ నిఘా నేత్రాలు ఉండగానే, ఒక వ్యక్తి లేదా వ్యక్తులు బ్యాగులో మృతదేహాన్ని తీసుకువచ్చి లిఫ్ట్ పక్కన పడేసి వెళ్తుంటే ఎవరూ ఎందుకు గమనించలేదనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. నిరంతరం జనసమ్మర్థంగా ఉండే సూపరింటెండెంట్ ఆఫీస్ వద్ద భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు?

అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ శిశువు కేజీహెచ్‌లోనే జన్మించిందా? లేక బయట ఎక్కడైనా చనిపోతే ఎవరైనా తీసుకువచ్చి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆసుపత్రిలోని సిసి ఫుటేజీని సేకరించి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలిస్తున్నారు. శిశువు మృతదేహంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, ఈ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత సాధారణ రోజుల్లో తనిఖీలను ‘తూ తూ మంత్రంగా’ నిర్వహించడం పరిపాటిగా మారిందని వారు మండిపడుతున్నారు. భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలని, ప్రతి బ్యాగును తనిఖీ చేసే వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *