Last Updated:
International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని రంగాల్లో అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
International Women’s Day 2026: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని రంగాల్లో అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మహిళలు తమ ప్రతిభతో కుటుంబం, సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదిస్తున్నారని ఆయన అభినందించారు. అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన దూరదృష్టి నాయకుడు ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. మహిళల గౌరవం, హక్కుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. మహిళల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. మహిళలు చదువులో ముందుకు రావాలని ఆయన తీసుకున్న చర్యలు ఎంతో ప్రేరణాత్మకమని చెప్పారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో వారికి అవకాశాలు కల్పించిన తొలి నాయకుల్లో ఎన్టీఆర్ ఒకరు అని ముఖ్యమంత్రి వివరించారు.
గతంలో ఆడబిడ్డ పుట్టినప్పుడు కుటుంబాలు ఆందోళన చెందేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు వివరించారు. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.5,000 డిపాజిట్ చేయడం, హైస్కూల్ చదివే విద్యార్థినులకు సైకిళ్లు అందించడం వంటి కార్యక్రమాల ద్వారా అమ్మాయిల విద్యను ప్రోత్సహించామని చెప్పారు. గతంలో పెళ్లైన మహిళలు ఇంటి బయటకు వస్తే విమర్శలు ఎదుర్కొనేవారని గుర్తుచేశారు. అయితే డ్వాక్రా, మెప్మా వంటి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వివరించారు. ఇప్పుడు మహిళలు వ్యాపారాల్లో ముందుకు వచ్చి కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య ఇప్పటికే లక్ష దాటిందని, ఈ ఏడాది ఆ సంఖ్యను 5 లక్షలకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. మహిళలు స్వయంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో గౌరవం, గుర్తింపు పొందుతున్నారని చెప్పారు.
స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చంద్రబాబు వివరించారు. అలాగే మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా అందిస్తున్నామని చెప్పారు. మహిళలు తీసుకునే ప్రతి పనిని పూర్తి చేసే వరకు కృషి చేస్తారని ఆయన ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులను లోకల్ బ్రాండ్ నుంచి గ్లోబల్ బ్రాండ్‌గా మార్చే బాధ్యత ప్రభుత్వదేనని సీఎం అన్నారు. నాణ్యత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. రాష్ట్రంలో డ్వాక్రా, మెప్మా సంఘాల్లో సుమారు 1.10 కోటి సభ్యులు ఉన్నారని, వారి ఉత్పత్తులు దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. 2019 నుంచి ఐదేళ్ల పాటు జగన్ హయాంలోని ఏపీ విధ్వంసమైందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



