Last Updated:
చిత్తూరు జిల్లాలో కుప్పం, శాంతిపురం, పెనుమూరులో కొత్త పార్కులు, కెమికల్, ఫుడ్, కాఫీ యూనిట్లు, పులిగుండు టూరిజం ప్రాజెక్టులతో వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాలు రానున్నాయి
చిత్తూరు జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయాలతో జిల్లాకు భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా కుప్పం, శాంతిపురం పెనుమూరు ప్రాంతాల్లో కీలక ప్రాజెక్టులకు భూ కేటాయింపులు జరగడం జిల్లా అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది.
1. కుప్పం, శాంతిపురంలో నూతన పారిశ్రామిక పార్కులు: కుప్పం, శాంతిపురం మండలాల్లో రెండు కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ (APIIC) కి అప్పగించాలని నిర్ణయించారు. కుప్పంలో 15.88 ఎకరాల భూమిని ఎకరాకు రూ.90 లక్షల మార్కెట్ విలువ చొప్పున కేటాయించారు. శాంతిపురంలో 25 ఎకరాల భూమిని ఎకరాకు రూ.16 లక్షల చొప్పున ఏపీఐఐసీకి అప్పగించనున్నారు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
2. భారీ కెమికల్ ప్రాజెక్టు, ఫుడ్ పార్క్: జిల్లాలో భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కుప్పం మండలంలో ఎన్పీఎస్ పీఎల్ (NPSPL) స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 105 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు రూ.2,550 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
అదేవిధంగా, శాంతిపురం మండలం చీమనపల్లెలో ఆగ్రో ఫుడ్ ఇన్నోవేషన్ జోన్ (ఫుడ్ పార్క్) ఏర్పాటు కానుంది. రూ.989 కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రెండు దశల్లో 450 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇది స్థానిక రైతులకు ఎంతో మేలు చేయనుంది.
3. పులిగుండు వద్ద పర్యాటక విప్లవం: పెనుమూరు మండలంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పులిగుండు వద్ద వెల్నెస్ టూరిజం, రిసార్టులను అభివృద్ధి చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటిపల్లె గ్రామంలోని 79.03 ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించారు.
గత ఏడాది ఇక్కడ జరిగిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో సుమారు 2,000 మంది యోగా చేయగా, ఆ ఫోటోలను ప్రధాని మోదీ రీట్వీట్ చేసి అభినందించారు. ఈ గుర్తింపుతో ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.22.03 కోట్ల విలువైన ఈ భూమిలో అంతర్జాతీయ స్థాయి రిసార్టులు ఏర్పాటు కానున్నాయి.
4. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు భూమి: సామాజిక బాధ్యతలో భాగంగా కుప్పం మండలం పెద్ద బంగారునత్తం గ్రామంలో 1.99 ఎకరాల భూమిని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు 30 ఏళ్ల లీజుకు కేటాయించారు. ఇక్కడ ‘సెంట్రలైజ్డ్ కిచెన్’ నిర్మించి, ప్రభుత్వ పథకాల కింద వేలాది మందికి నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు.
5. కాఫీ ప్రాసెసింగ్ యూనిట్: దోని ఇండస్ట్రియల్ ఏరియాలో రూ.403 కోట్ల పెట్టుబడితో ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన హక్కులను కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక వేగం పుంజుకోనుంది. వేల కోట్ల పెట్టుబడులు, వందలాది ఉద్యోగాల కల్పనతో జిల్లా ముఖచిత్రం మారబోతోంది. పర్యాటక రంగం నుంచి రసాయన పరిశ్రమల వరకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి బాటలు పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



