High Court: మదనపల్లె మున్సిపల్ అధికారిణికి హైకోర్టు షాక్.. పల్లవిపై అరెస్ట్ వారెంట్ జారీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

High Court: అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మున్సిపల్ ఆర్ఓ పల్లవిపై విధుల్లో నిర్లక్ష్యం కోర్టు ధిక్కరణ ఆరోపణలతో హైకోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది

మదనపల్లె ఆర్ఓ పల్లవి కి అరెస్ట్ వారెంట్ ఎందుకంటే...!!! 
మదనపల్లె ఆర్ఓ పల్లవి కి అరెస్ట్ వారెంట్ ఎందుకంటే…!!! 

అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (RO) పల్లవికి రాష్ట్ర హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహించడం, అలాగే న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకపోవడం వంటి కారణాలతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

గతంలో పల్లవి బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో, స్థానికంగా ఒక వ్యక్తి ఎలాంటి అధికారిక ప్లాన్ అప్రూవల్ లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన రెడ్డెప్ప అనే వ్యక్తి, అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించారు. అయితే, అప్పటి కమిషనర్ పల్లవి ఆ నిర్మాణాన్ని ఆపడంలో విఫలమయ్యారని, తన విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ రెడ్డెప్ప హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో, వాస్తవాలను ఆరా తీసేందుకు పల్లవిని ఆన్‌లైన్ ద్వారా హాజరుకావాలని న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. అయితే, ఆమె కోర్టు ఆదేశాలను పాటించకపోవడమే కాకుండా, విచారణకు హాజరుకాకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. న్యాయస్థానం పట్ల అగౌరవంగా వ్యవహరించడం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, దీనిని ‘కోర్టు ధిక్కరణ’ (Contempt of Court) కింద పరిగణిస్తూ ఆమెపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

పల్లవిని అరెస్ట్ చేసి, ఈ నెల 30వ తేదీన న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 2వ తేదీనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించి ఎస్పీ కార్యాలయానికి అధికారికంగా పత్రాలు అందాయి.

న్యాయస్థానం జారీ చేసిన ఈ బెయిలబుల్ వారెంట్‌లో కొన్ని కీలక నిబంధనలు విధించింది. ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే, రూ. 10,000 బాండ్, ఇద్దరి వ్యక్తుల పూచికత్తు సమర్పించినట్లయితే బెయిల్ మంజూరు చేయాలని సూచించింది. ఈ నెల 30న జరిగే విచారణకు కచ్చితంగా హాజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు ప్రతి వాయిదాకు వస్తానని ఆమె లిఖితపూర్వకంగా ప్రమాణపత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్‌గా ఉన్న పల్లవిపై ఇలాంటి అరెస్ట్ వారెంట్ రావడం ఇతర అధికారులను అప్రమత్తం చేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఈ నెల 30న హైకోర్టులో జరగబోయే విచారణలో ఆమె ఇచ్చే వివరణపైనే తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *