Health Awareness: యువతకు డాక్టర్ల హెచ్చరిక.. 25-45 ఏళ్ల వారు ఈ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

అధిక రక్తపోటు కారణంగా ‘అయోర్టిక్ డిసెక్షన్’ అనే ప్రమాదకర గుండె సంబంధిత సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో అరుదైన హైబ్రిడ్ శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని వైద్యులు విజయవంతంగా కాపాడారు.

+

ఈ

ఈ ఒక్కపని చేయకపోతే భవిష్యత్ లో మీ గుండె నాళాలు చీలే అవకాశం ఉంది అంటున్న వైద్యులు

మానవ శరీరంలో గుండె ఒక ఇంజిన్ వంటిది. గుండె నుంచి శరీరంలోని ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేసే అతిపెద్ద రక్తనాళం ‘అయోర్టా’ (Aorta). అయితే, ఈ రక్తనాళం యుక్త వయసులో, ముఖ్యంగా హై బీపీ (అధిక రక్తపోటు) వంటి సమస్యల వల్ల అకస్మాత్తుగా చీలే ప్రమాదం ఉందని విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చక్రధర్ పెద్దాడ హెచ్చరిస్తున్నారు. వైద్య పరిభాషలో దీనిని ‘అయోర్టిక్ డిసెక్షన్’ (Aortic Dissection) అని పిలుస్తారు. నేటి జీవనశైలి కారణంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఈ సమస్య బారిన పడుతున్నారని, కాబట్టి ప్రతి ఒక్కరూ తరచూ బీపీని పరీక్షించుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

ఇటీవల విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌లో వైద్యులు ఒక అత్యంత సంక్లిష్టమైన ‘Type B Aortic Dissection’కు హైబ్రిడ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. విశాఖపట్నంలోనే ఈ తరహా హైబ్రిడ్ అయోర్టిక్ రిపేర్ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 43 ఏళ్ల ఒక వ్యక్తి గతంలోనే ‘Type A Aortic Dissection’తో బాధపడి ‘డేవిడ్ ప్రొసీజర్’ (David Procedure) ద్వారా చికిత్స పొందారు.

అయితే, ఆ తర్వాత జరిగిన ఫాలో-అప్ పరీక్షల్లో రోగికి మళ్లీ ఛాతి నొప్పి, తీవ్రమైన రక్తపోటు సమస్యలు కనిపించాయి. CT స్కాన్ ద్వారా పరిశీలించగా, అతనికి ‘Type B Aortic Dissection’ ఉన్నట్లు గుర్తించారు. ఇది రక్తనాళం ప్రధాన భాగం నుంచి కింది వరకు విస్తరించి ఉండటంతో, ప్రాణాపాయాన్ని తప్పించేందుకు వైద్యులు హైబ్రిడ్ ఇంటర్వెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.

డాక్టర్ చక్రధర్ పెద్దాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ శస్త్రచికిత్స రెండు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో, మెడ భాగంలోని రక్తనాళాలను ‘డిబ్రాంచింగ్’ చేసి, మెదడుకు, శరీర పై భాగాలకు రక్త సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 5 నుంచి 6 గంటల పాటు జరిగిన ఈ క్లిష్టమైన ప్రక్రియ తర్వాత, క్యాథ్ ల్యాబ్‌లో ‘ఎండోవాస్కులర్ ఎన్యూరిజం రిపేర్’ (EVAR) చేశారు. దీనిలో భాగంగా ఫెమోరల్ ఆర్టరీ (తొడ రక్తనాళం) ద్వారా స్టెంట్ గ్రాఫ్ట్‌ను అమర్చి, చీలికను విజయవంతంగా సరిచేశారు.

అత్యంత ఆధునిక సాంకేతికతతో జరిగిన ఈ హైబ్రిడ్ చికిత్స వల్ల రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకొని, కేవలం ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ చక్రధర్ మాట్లాడుతూ, హై బీపీని నిర్లక్ష్యం చేయడం వల్ల రక్తనాళాలు బలహీనపడి, ప్రాణాపాయ స్థితికి దారితీస్తాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతలో ఒత్తిడి, జీవనశైలి మార్పుల వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతోందని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇటువంటి గంభీరమైన సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని ఆయన పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చిన ఈ అధునాతన హైబ్రిడ్ చికిత్స పద్ధతులు, గుండెకు సంబంధించిన సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *