Food Festival: విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్.. ఘుమఘుమలాడిన విదేశీ వంటలు.. పూర్తి వివరాలు ఇవే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం బీచ్ రోడ్ వద్ద AU శతాబ్ది వేడుకల్లో International Students Feast Festలో 40 దేశాల వంటకాలు, సంస్కృతులు ఏకవేదికగా మెరిశాయి.

+

విశాఖలో

విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్..! ఘుమఘుమలాడిన విదేశీ వంటలు

విశాఖపట్నం నగరంలోని సాగర తీరం విభిన్న దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు నోరూరించే వంటకాలకు వేదికైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫీస్ట్ ఫెస్ట్’ నగర వాసులకు సరికొత్త అనుభూతిని అందించింది. దాదాపు 40 దేశాలకు చెందిన విద్యార్థులు తమ స్వదేశీ రుచులను ఇక్కడ ప్రదర్శించడంతో, విశాఖ వాసులకు ప్రపంచ స్థాయి వంటకాలను రుచి చూసే అరుదైన అవకాశం లభించింది.

ఈ ఆహార వేడుకను డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DCI) మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఎస్. దివాకర్, ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రతి స్టాల్‌ను సందర్శించి, విదేశీ విద్యార్థులు తయారు చేసిన వైవిధ్యమైన వంటకాలను స్వయంగా రుచి చూశారు. విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో సుమారు 40 దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు 38 ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో వంటకం వెనుక ఆ దేశ సంస్కృతి, చరిత్ర, వారసత్వం దాగి ఉంది. ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణలు ఇవే.. ఇథియోపియా విద్యార్థులు నిర్వహించిన సాంప్రదాయ కాఫీ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరిత్రియాకు చెందిన చికెన్, ఎగ్ రెసిపీలు, కొమరూన్ దేశపు ‘ఇగుసి సూప్’, అంగోలా విద్యార్థుల ‘ఫుంగి’, ‘కాలులు’ సందర్శకులను కట్టిపడేశాయి. ఆఫ్ఘనిస్థాన్ వారి నోరూరించే ‘కాబూలి పలావ్’, నేపాల్ వారి ప్రసిద్ధ ‘మోమోలు’, కాంబోడియా విద్యార్థులు చేపలతో చేసిన వైవిధ్యమైన వంటకాలు ఆహార ప్రియులను అలరించాయి.

జోర్డాన్ విద్యార్థులు తయారు చేసిన ‘షవర్మ’, మారిషస్ వారి ‘ఢోలి పూరి’ వంటి శాకాహార వంటకాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. వీటితో పాటు నమీబియా, మయన్మార్, నైజీరియా, పాలస్తీనా, సోమాలియా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, సూడాన్, టాంజానియా, ఉగాండా, వియత్నాం వంటి దేశాల సాంప్రదాయ వంటకాలు ఇక్కడ కొలువుదీరాయి.

విదేశీ వంటకాలతో పాటు మన దేశీయ రుచులను చాటిచెప్పేందుకు ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు, ఆచార్యుల సహకారంతో మరో 18 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ కోర్సులో భాగంగా నేర్చుకున్న సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన బిస్కెట్లు, కేకులు, స్వదేశీ పానీయాలు విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి. మన భారతీయ మసాలాలు, రుచులను విదేశీ విద్యార్థులు ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు.

కార్యక్రమంలో కెప్టెన్ ఎస్. దివాకర్ మాట్లాడుతూ.. “ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అన్న చందంగా ఈ కార్యక్రమం ఉంది. ‘థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్’ అనే నినాదానికి ఏయూ ఈ ఫెస్టివల్ ద్వారా రూపమిచ్చింది” అని కొనియాడారు. వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ మాట్లాడుతూ, విదేశీ విద్యార్థులు తమ సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించడం, వారి ఆహారపు అలవాట్లను మనకు పరిచయం చేయడం ద్వారా సంస్కృతుల మధ్య వారధి ఏర్పడిందన్నారు.

ఇదే ఉత్సాహంతో ఈ నెల 26న విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైవిధ్యత, సాంప్రదాయాల కలయికగా సాగిన ఈ ఫుడ్ ఫెస్టివల్ విశాఖ నగర చరిత్రలో ఒక ప్రత్యేక వేదికగా నిలిచిపోయింది. ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, దేశాల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమానురాగాలను పెంచుతుందని ఈ వేడుక నిరూపించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *