Last Updated:
Vijayawada Electric Buses: నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలో త్వరలో విద్యుత్తు బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదటి దశలో వంద ఈ-బస్సులను కేటాయించారు. అయితే వీటి నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒప్పంద ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఆరు నెలల్లో బస్సులు రోడ్డెక్కనున్నాయి.
Vijayawada Electric Buses: నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలో త్వరలో విద్యుత్తు బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదటి దశలో వంద ఈ-బస్సులను కేటాయించారు. అయితే వీటి నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒప్పంద ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఆరు నెలల్లో బస్సులు రోడ్డెక్కనున్నాయి.
ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-బస్ సేవా స్కీమ్ (PM eBus Seva Scheme) కింద అమలవుతోంది. కాలుష్య నియంత్రణ లక్ష్యంగా నడుస్తున్న ఈ పథకంలో నిర్వహణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించనున్నాయి. ప్రజలకు సౌకర్యవంతమైన, పర్యావరణానికి హితమైన రవాణా అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
ప్రస్తుతం విజయవాడలో సుమారు 400 సిటీ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో పాతబడిన బస్సులను దశలవారీగా తొలగించి, వాటి స్థానంలో విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల రోజుకు సుమారు 7,000 లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నిర్వహించిన అధ్యయనంలో విజయవాడలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నట్లుగా తేలింది. విద్యుత్తు బస్సుల వినియోగంతో గాలి కాలుష్యం కొంత మేర తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రజారోగ్య పరిరక్షణకు కూడా తోడ్పడనుంది.
విద్యుత్తు బస్సుల నిర్వహణ కేంద్రం ఏర్పాటు నేపథ్యంలో విద్యాధరపురం డిపోను పూర్తిగా ఆధునీకరించనున్నారు. మెరక పనులు, కొత్త ప్లాట్‌ఫాంలు, అధికారుల కార్యాలయ భవనాలు, ఇతర సివిల్ పనుల కోసం రూ.12.5 కోట్లు కేటాయించారు. డిపో రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. అదనంగా 6,000 కేవీ సామర్థ్యంతో సబ్‌స్టేషన్, ఆధునిక ఛార్జింగ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఐదు బస్సులకు ఒక్కోటి చొప్పున మొత్తం 20 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో పాటు వైరింగ్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాల కోసం రూ.10.5 కోట్లు వెచ్చించనున్నారు. ఈ వ్యయంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి.
ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థకు అప్పగించారు. సంస్థ 250 మంది డ్రైవర్లను సమకూర్చనుండగా మరో 250 మంది కండక్టర్లను ఆర్టీసీ సర్దుబాటు చేయనుంది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రతి విద్యుత్తు బస్సులో 40 సీట్లు ఉండగా, మహిళలకు ఉచిత బస్సు పథకం ఈ బస్సుల్లో కూడా అమలవుతుంది. మొత్తం 100 ఈ-బస్సులను నగరంలోని 11 ప్రధాన మార్గాల్లో నడపనున్నారు. దీంతో విజయవాడలో రవాణా వ్యవస్థ మరింత సౌకర్యవంతంగా కాలుష్య రహితంగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



