DWCRA: మహిళలకు మరోసారి చంద్రన్న కానుక.. ఈ నెల 8న ప్రారంభం.. డ్వాక్రా మహిళలకు పండగే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

News18
News18

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ సాధికారత దిశగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన కొత్త కార్యక్రమాలను వెల్లడించనున్నారు.

మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రంపచోడవరం, తుళ్లూరు , కుప్పం , మాచర్ల , తణుకు , మదనపల్లె , మార్కాపురం, ఆదోని , తిరువూరు, టెక్కలి ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో అద్దె భవనాల్లో సేవలు అందించగా, కేంద్రం మంజూరు చేసిన రూ.6 కోట్ల నిధులతో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కేంద్రాల ద్వారా గృహహింస, వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు న్యాయ, వైద్య, కౌన్సెలింగ్ సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.

పని చేసే మహిళలకు సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో లభ్యమయ్యే సౌకర్యాలు, ఖాళీలు, నమోదు విధానం వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. అదనంగా, మరో 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల ఏర్పాటు విషయమై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.

డ్వాక్రా మహిళల ఆర్థిక లావాదేవీల పారదర్శకత కోసం ‘మన డబ్బులు – మన లెక్కలు’ అనే యాప్‌ను ప్రారంభించనున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు ‘స్వయం’ అనే ప్రత్యేక బ్రాండ్‌ను పరిచయం చేయనున్నారు. దీని ద్వారా మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉంది.

వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు వెదురు, మునగ సాగును ప్రోత్సహిస్తూ ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. రంపచోడవరంలో రూ.65 లక్షల వ్యయంతో వెదురు ప్రాసెసింగ్ యూనిట్, చిత్తూరులో రూ.70 లక్షలతో మునగ ప్రాసెసింగ్ యూనిట్‌కు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో రూ.2 కోట్లతో, విశాఖపట్నంలో రూ.1 కోట్లతో ప్రాంతీయ శిక్షణ కేంద్రాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరగనుంది. పట్టణ ప్రాంతాల్లో ఐదు ‘తృప్తి’ క్యాంటీన్లను ప్రారంభించి తక్కువ ధరలో ఆహారం అందించే చర్యలు తీసుకుంటున్నారు.

అదేవిధంగా మహిళా సాధికారత కోసం ఎన్‌ఈసీసీ, ఐఎస్‌బీ, అమృత్ యూనివర్సిటీతో పాటు సుమారు 40 సంస్థలతో సెర్ప్, మెప్మా ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. మొత్తం మీద, మహిళల భద్రత, ఉపాధి, ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *