Last Updated:
వరకట్న నిషేధ చట్టం 1961 పై ఆర్. సన్యాసి నాయుడు అవగాహన, యువతలో మార్పు పిలుపు, 181, 1098, సఖి వన్ స్టాప్ సెంటర్ సేవల వినియోగం ప్రాముఖ్యం.
వరకట్నం అనే సామాజిక కీడు నిర్మూలనకు చట్టపరమైన అవగాహనతో పాటు సామాజిక బాధ్యత అత్యంత అవసరమని సీనియర్ సివిల్ జడ్జి & జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి ఆర్. సన్యాసి నాయుడు అన్నారు. విశాఖలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశు అభివృద్ధి అర్బన్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం, ఎఫ్‌సిఐ నగర్, మర్రిపాలెం లో “వరకట్న నిషేధ చట్టం 1961” పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాహానికి ముందు, సమయంలో లేదా తరువాత నగదు, బంగారం, ఆస్తి రూపంలో వరకట్నం అడగడం, ఇవ్వడం లేదా తీసుకోవడం చట్ట రీత్యా నేరమని తెలిపారు. ఈ చట్టం వధువు, వరుడి ఇరువర్గాలకూ సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు. వరకట్నం తీసుకున్న లేదా ఇచ్చిన వారికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.15,000 జరిమానా లేదా తీసుకున్న కట్నం విలువకు సమానమైన జరిమానా విధించబడుతుందని చెప్పారు. అలాగే వరకట్నం కోరుతూ వేధింపులకు పాల్పడిన వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని తెలిపారు.
కేవలం చట్టాలు అమలు చేయడం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు రాదని, యువతలో ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుకున్న యువకులు వరకట్నం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయాలని, తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఉన్నత విద్యనే నిజమైన ఆస్తిగా ఇవ్వాలని సూచించారు. వరకట్న వేధింపులకు గురయ్యే మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతూ, వారికి సహాయం కోసం 181 మహిళా హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ లైన్, డి.వి. సెల్, సఖి వన్ స్టాప్ సెంటర్ వంటి సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మహిళా శక్తి కేంద్రాల ద్వారా కూడా సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.
వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరాలేనని, గౌరవప్రదమైన వివాహ వ్యవస్థను వ్యాపారంగా మార్చకూడదని, వరకట్న రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక దత్తత సంస్థ (SAA) శిశుగృహం, ఎఫ్‌సిఐ నగర్, మర్రిపాలెం ను సందర్శించి, అక్కడి పిల్లల సంరక్షణ, ఆహారం, ఆరోగ్య హైజీన్ పరిస్థితులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



