Last Updated:
Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడానికి కారణాలు చెప్పారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్. ఈ వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పశుగ్రాసాల కొరత, నీటి లభ్యత లోపం పాల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయన్నారు.
Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని విజయనగరం వెటర్నరీ పోలి క్లినిక్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్ తెలిపారు. ఈ వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పశుగ్రాసాల కొరత, నీటి లభ్యత లోపం వంటి కారణాలు పాల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు.ప్రధానంగా పచ్చి గడ్డి కొరత ఉండటం వల్ల పశువులు తగిన పోషకాహారం పొందలేకపోతున్నాయని తెలిపారు. పచ్చి గడ్డిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో అది పశువులలో డీహైడ్రేషన్ సమస్యను కొంతవరకు తగ్గిస్తుందని చెప్పారు. అందువల్ల పచ్చి గడ్డి అందుబాటులో ఉన్న డైరీ రైతుల వద్ద పాల ఉత్పత్తి తగ్గుదల తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఎండల వల్ల పశువుల్లో ఉష్ణ ఒత్తిడి (హీట్ స్ట్రెస్) పెరిగి పాల ఉత్పత్తి తగ్గుతుందని తెలిపారు. సాధారణంగా ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలకూ పశువుల పాల దిగుబడి సుమారు 250 మిల్లీలీటర్ల వరకు తగ్గే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు పశువుల శరీర వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి వాటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
ఈ సమస్యను అధిగమించడానికి పాడి రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువుల షెడ్లపై గడ్డి లేదా తారు బానులు ఏర్పాటు చేసి ఎండ నుంచి రక్షణ కల్పించాలన్నారు. అవి అందుబాటులో లేని పరిస్థితుల్లో పశువులను తరచుగా నీటితో తడపడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చని తెలియజేశారు.
వేసవిలో పశువులను బయటకు మేపుకి తీసుకెళ్లేటప్పుడు ఉదయం 10 గంటలలోపే తీసుకెళ్లడం మంచిదని సూచించారు. మధ్యాహ్నం తీవ్ర ఎండ సమయంలో పశువులను బయట ఉంచకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. అలాగే ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని చెప్పారు. ఇకపోతే పశువులకు సరైన ఆహారం, మినరల్ మిశ్రమాలు, సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా కూడా పాల ఉత్పత్తిని కొంతవరకు నిలబెట్టుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు ఈ సూచనలు పాటిస్తే వేసవికాలంలో కూడా పాల దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ మోహన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh
Mar 27, 2026 10:33 AM IST


