Last Updated:
నారాయణగూడ పరిధిలోని బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. తాము బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సిటీ సంస్థ ప్రతినిధులమని కేటుగాళ్లు పరిచయం చేసుకున్నారు.
Cyber Fraud: నగరంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ టాస్కుల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ. 3.30 లక్షలు కాజేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈనాడు కథనం ప్రకారం.. నారాయణగూడ పరిధిలోని బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. తాము బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సిటీ సంస్థ ప్రతినిధులమని కేటుగాళ్లు పరిచయం చేసుకున్నారు. తాము పంపే ఆన్లైన్ లింకులపై క్లిక్ చేసి టాస్కులు పూర్తి చేస్తే, ప్రతి క్లిక్కు రూ. 50 చెల్లిస్తామని ఆశ చూపారు. మొదట్లో బాధితుడికి నమ్మకం కలిగించేందుకు కొన్ని చిన్న టాస్కులు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా రూ. 8,500 చెల్లించారు.
బాధితుడు వారిని పూర్తిగా నమ్మిన తర్వాత, కేటుగాళ్లు అసలు ప్లాన్ అమలు చేశారు. బిట్‌కాయిన్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని ప్రలోభపెట్టి, అతడిని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చారు. ఆ గ్రూపుల్లో ఉన్న ఇతర సభ్యులు (వీరు కూడా నేరగాళ్ల ముఠాకు చెందిన వారే) తమకు లక్షల్లో లాభాలు వస్తున్నట్లు నకిలీ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ బాధితుడిని రెచ్చగొట్టారు. దీనిని నిజమని నమ్మిన బాధితుడు విడతల వారీగా రూ. 3.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత అతను వాడుతున్న యాప్‌లో ఆ మొత్తం రూ. 6.40 లక్షలుగా పెరిగినట్లు కనిపించింది.
యాప్‌లో కనిపిస్తున్న లాభాలను వెనక్కి తీసుకోవాలని (Withdraw) బాధితుడు ప్రయత్నించగా, కేటుగాళ్లు అడ్డుతగిలారు. ఆ నగదును ఉపసంహరించుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజు, పన్నుల పేరుతో మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన బ్యాంకు ఖాతా మరియు యూపీఐ ఐడీలను బ్లాక్ చేయాలని, లావాదేవీలను రివర్స్ చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు.
ఆన్లైన్ టాస్కులు, యూట్యూబ్ లైక్స్ లేదా రేటింగ్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చనే సందేశాలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



