Last Updated:
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్ లో 57 దేశాల 1150 మంది విద్యార్థుల అంతర్జాతీయ సాంస్కృతిక విభావరి ఆకట్టుకుంది.
ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 57 దేశాలకు చెందిన 1150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా దేశాలకు చెందిన విద్యార్థులు తమ వేషధారణంలో కళలను, సాంస్కృతిక ప్రదర్శనలు చేసారు. ఏయూ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఇది ఒకటిగా నిలుస్తుందని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు.
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అదే విధంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవానికి సైతం మంచి ఆదరణ లభించిందని అన్నారు. విద్యార్థులు తమ కళలను సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారని అన్నారు.
వసుదైక కుటుంబానికి నిదర్శనంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో తాను పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. అనంతరం విజయ కృష్ణన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగా నేడు మీ రంతా ఇక్కడ విద్యను అభ్యశించడం నిలుస్తుందన్నారు.
విద్య రంగంలో ఏయూ ఒక విలువైన రంత్నంగా విరాజిల్లుతోందన్నారు. ఐక్యత, వైవిధ్యతలే మన బలమని చెప్పారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటు పడాలని సూచించారు. ఏయూ అత్య్తుత్త నాణ్యత ప్రమాణాలతో విద్యను అందిస్తోందన్నారు. ప్రపంచం నేడు అనుసంధానించబడిందని, విభిన్న దేశాల సంస్కృతులు పంచుకుంటూ, సామరస్య జీవనం సాగించాలన్నారు.అంతర్జాతీయ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా దీనిని తీర్చిదిద్దిన ఏయూ అధికారులను అభినందించారు. నృత్యం, సంగీతం, కలలకు నిదర్శనంగా ఈ వేదిక నిలవాలని ఆకాంక్షించారు.
అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ 57 దేశాలకు చెందిన 1150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యశిస్తున్నారన్నారు. కార్యక్రమంలోఅసోసియేట్ డీన్‌లు ఆచార్య ఎన్.ఎం యుగంధర్, ఆచార్య విజయశాంతి, పలువురు ఆచార్యులు, డీన్‌లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంరతం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతిని, సాంప్రదాయాలు, నృత్యరీతులను పరిచయం చేస్తూ నిర్వహిచిన కార్యక్రమం ఆద్యంతం అలరించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


