Couple Suicide: ఆ జిల్లాలో విషాదం! వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు ఆత్మహత్య.. చనిపోకముందు వీడియోలో ఏం చెప్పారంటే |


Last Updated:

అన్నమయ్య జిల్లా గాలివీడులో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య, ఇద్దరు చిన్నారులు అనాథలు, పోలీసులు కేసు నమోదు.

News18
News18

వడ్డీ వ్యాపారుల వేధింపులు, తీరని అప్పులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు ఇద్దరూ తనువు చాలించడంతో వారి ఇద్దరు పిల్లలు ఇప్పుడు దిక్కులేని వారయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. గాలివీడు మండల కేంద్రంలోని శెట్టివారిపల్లెకు చెందిన మారువేణి మల్లికార్జున (35), ఆయన భార్య రాణి (30) సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం మల్లికార్జున స్థానికంగా ఉండే కొంతమంది వడ్డీ వ్యాపారుల వద్ద భారీ వడ్డీలకు అప్పులు తీసుకున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబానికి ఆ వడ్డీలే శాపంగా మారాయి.

గత కొంతకాలంగా తాము సంపాదించిన మొత్తాన్ని వడ్డీల రూపంలో చెల్లిస్తున్నప్పటికీ, అసలు మాత్రం తగ్గలేదు. దీనికి తోడు వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడం, నిరంతరం వేధింపులకు గురిచేయడంతో ఆ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించారు.

గత శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మల్లికార్జున, రాణి ఇద్దరూ పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మల్లికార్జున మృతి చెందాడు.

అదే ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ శనివారం రాత్రి రాణి తుది శ్వాస విడిచింది. చనిపోయే ముందు రాణి ఒక వీడియో ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కింది. తాము తీసుకున్న నిర్ణయానికి వడ్డీ వ్యాపారుల వేధింపులే ప్రధాన కారణమని ఆమె ఆ వీడియోలో స్పష్టం చేసింది. ఈ ఘటనతో శెట్టివారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. “అమ్మా నాన్నలు లేని మాకు ఇక దిక్కు ఎవరు?” అంటూ ఆ పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బంధువులు విలపిస్తున్నారు.

వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, రాణి మరణానికి ముందు చేసిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *