Last Updated:
CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంతకాలం అమరావతి నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.
CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంతకాలం అమరావతి నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తన సతీమణితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో గందరగోళం సృష్టించారని విమర్శించారు. అన్ని అవరోధాలను అధిగమించి అమరావతిని సాధించుకోవడం ఆనందదాయకమని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఆనందకరమని హర్షించారు. ఆ పార్టీలు అన్నింటికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
అమరావతికి వ్యతిరేకంగా నిలిచిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని పేర్కొంటూ, కఠిన పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై అమరావతిని ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. దీన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని ఆకాంక్షిస్తూ రాజ్యసభ ఛైర్మన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.
నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లు, ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. దీంతో ఉభయసభల్లో బిల్లుకు పూర్తి ఆమోదం లభించింది. తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదలై, అమరావతి బిల్లు అధికారికంగా చట్టంగా మారనుంది.
ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మొత్తం 17 మంది సభ్యులు పాల్గొన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. మొత్తం 11 రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు చర్చలో పాల్గొనగా, వాటిలో 10 పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సదానంద్ ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



