
ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా:
రైలు నెం 21896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో అందించిన ఆహార పదార్థాలలో పురుగు కనిపించిందని 15.03.2026న ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా, బోర్డు దానిని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ సంఘటన ఐఆర్‌సీటీసీ వైపు నుంచి సరైన పర్యవేక్షణ లోపాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ లోపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సేవలలో ఇటువంటి లోపానికి గాను ఐఆర్‌సీటీసీపై రూ. 10 లక్షల జరిమానా విధించాలని సమర్థ అధికారి నిర్ణయించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు రైలులోని సేవలను కఠినంగా పర్యవేక్షించాలని ఐఆర్‌సీటీసీకి రైల్వేశాఖ సూచించింది.

ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. ఇరాన్ నేవీ చీఫ్ మృతి
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇజ్రాయెల్ మెరుపు దాడులకు పాల్పడుతోంది. ఈ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరీ మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ప్రకటించాయి. ఇరాన్ సముద్ర తీర రక్షణ, హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించడంలో అలిరెజా తంగ్సిరీ కీలక పాత్ర పోత్సహిస్తూ వస్తున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నావికా దళానికి ఆయన నాయకత్వం వహించారు. ఇలా ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేయడంతో ముఖ్యంగా తంగ్సిరీని లక్ష్యంగా చేసుకుని దాడులు పాల్పడంతో ఇరాన్ సైనిక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేలా చర్యలు ప్రారంభించారు.

మార్కాపురం బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు ఎక్స్‌గ్రేషియో
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇప్పటివరకూ 13 మంది మృతదేహాలను బస్సు నుంచి వెలికి తీశారు. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో మరో 26 మందికి గాయాలు అయ్యాయి. వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దీంతో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా:
ప్రస్తుతం దేశీయ చమురు మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ కోసం బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రైవేట్ రంగానికి చెందిన నయారా ఎనర్జీస్ పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది.
రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ ‘రాస్‌నెఫ్ట్’ భాగస్వామ్యంతో ఉన్న ఈ సంస్థ లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.5, డీజిల్‌పై రూ.3 వరకు ధరలను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల అస్థిరతతో పాటు సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీస్ ఇప్పటికే ఈ కొత్త ధరలను అమల్లోకి తీసుకువచ్చింది.


