ఆదివారం 17మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆదివారం (05-04-26) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బూర్జ, హీరమండలం, జలుమూరు, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాలు , పోలవరం జిల్లా గంగవరం, కూనవరం మండలాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు (17) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
అలాగే శ్రీకాకుళం 2, విజయనగరం 8, మన్యం 9, పోలవరం 3, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో వడగాలులు(32) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
శనివారం నెల్లూరు(జి) గూడూరులో 41.2°C, తిరుపతి(జి) రేణిగుంటలో 41.1°C, కృష్ణా(జి) పెద్దపారుపూడిలో 40.9°C, చిత్తూరు(జి) నగరిలో 40.4°C, మన్యం(జి) వీరఘట్టంలో 40.3°C, విజయనగరం(జి) గుర్లలో 40.1°C, పల్నాడు(జి) గురజాల39.8°C, నంద్యాల(జి) గుల్లదుర్తి, కర్నూలు(జి) తోవిలో 39.7°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.


