Last Updated:
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఎండ తగ్గి, గోదావరి, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు, చల్లటి గాలులతో ప్రజలకు ఉపశమనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ, ప్రజలు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, ఎండ తీవ్రతతో అలమటిస్తున్న సకల జీవరాశులకు ఉపశమనం కలిగిస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లుగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిస్తే, మరికొన్ని చోట్ల కుండపోత వర్షం పడటంతో ప్రజలు ‘కరుణించావా వరుణ దేవా’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం, హైదరాబాద్ వాతావరణ కేంద్రాల సమాచారం ప్రకారం.. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. నిజానికి ఆదివారం అర్ధరాత్రి నుంచే కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా, సోమవారం నాటికి అది వర్షంగా మారింది. దీనివల్ల వేసవి తాపం తగ్గి, గాలిలో తేమ పెరగడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కాకినాడ నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లో ఉదయం నుంచే చల్లటి గాలులు వీచాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయి, కుండపోత వర్షం కురిసింది. ఈ అకాల వర్షం చూస్తుంటే ఇది ఎండాకాలమా లేక వర్షాకాలమా అన్న సందేహం స్థానికుల్లో కలిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అడపా దడపా వర్షాలు కురిసి నేలను తడిపాయి.
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవకపోయినప్పటికీ, ఆకాశం మేఘావృతమై ఉండటం చల్లటి గాలుల వల్ల ప్రజలకు ఎండ వేడి నుంచి గొప్ప ఉపశమనం లభించింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. తిరుమల వచ్చే భక్తులకు ఈ చల్లటి వాతావరణం ఎంతో హాయిని ఇచ్చింది.
వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న ఈ సమయంలో, ఈ నాలుగు రోజుల చల్లదనం ప్రజలకే కాకుండా పశుపక్షాదులకు ప్రాణవాయువులా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


