AP News: మండలిలో ‘లడ్డూ’ రగడ.. వైసీపీ Vs కూటమి సభ్యుల మధ్య మాటలయుద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో దుమారం రేపింది. మంత్రులు, సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

News18
News18

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పెను దుమారం రేపింది. ఈ సున్నితమైన, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. దాదాపు 20 పేజీలతో కూడిన సుదీర్ఘ నివేదికను సభలోని సభ్యులందరికీ అందజేసింది. ఈ నివేదికలో లడ్డూకు ఉన్న విశిష్టమైన చారిత్రక నేపథ్యం, దశాబ్దాలుగా పాటిస్తున్న తయారీ విధానాలు, వాడే దినుసుల ప్రమాణాలు, అలాగే తిరుమలలో వంశపారంపర్యంగా వస్తున్న పోటు-మిరాసీ వ్యవస్థ వంటి కీలక వివరాలను ప్రభుత్వం సవివరంగా పొందుపరిచింది.

లడ్డూ కల్తీ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినవి కావని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) అనే జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ఇచ్చిన శాస్త్రీయ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ఈ వాస్తవాలను బయటపెట్టిందని ఆయన గుర్తు చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై అధికార పక్ష మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఒకే అంశంపై రెండు విభిన్న తీర్మానాలు ఇవ్వడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సభలో గందరగోళం సృష్టిస్తూ చర్చను అడ్డుకుంటున్న ప్రతిపక్ష సభ్యులపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వాస్తవాలు వివరించేటప్పుడు వాకౌట్ చేసి పారిపోకుండా, నిజాన్ని వినే ధైర్యం చూపాలని ఆయన సవాల్ విసిరారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దోషులను ప్రజల ముందు నిలబెట్టే వరకు విశ్రమించబోమని ఆయన ఘంటాపథంగా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే వివరణకు ఎలాంటి సమయ నిబంధనలు ఉండవని, సభ ఎంతసేపు జరిగినా తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బట్ట కాల్చి ముఖాన వేసి పారిపోయే పద్ధతిని విడనాడాలని ఆయన ప్రతిపక్షాన్ని హెచ్చరించారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు కేవలం తమ వాదన వినిపించి, ప్రభుత్వ సమాధానం వినకుండా సభ నుంచి వెళ్లిపోవడం ఒక అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులను నియంత్రించాల్సిన బాధ్యత మండలి ఛైర్మన్‌పై ఉందని ఆయన కోరారు. తిరుమల లడ్డూ విషయంలో గత ప్రభుత్వ హయాంలో పీకల్లోతు తప్పులు జరిగాయని, వాటి నుండి తప్పించుకోవడానికే వైఎస్సార్సీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సభలో అన్ని పార్టీల ప్రతినిధులకు మాట్లాడే అవకాశం కల్పించాలని, అప్పుడే ప్రజలకు అసలు విషయాలు తెలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సభను నిర్వహిస్తున్న తీరుపై మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ పెదవి విరిచారు. ఒకే రోజు ఒకే అంశంపై రెండు మోషన్లు అజెండాలో ఎలా చేరుస్తారని వారు ఛైర్మన్ మోషేనురాజును నిలదీశారు. వైసీపీ సభ్యులు సభా నియమాలను తుంగలో తొక్కుతూ తప్పుడు సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు వాడిన కొన్ని పదాలను ఉపసంహరించుకోవాలని ఛైర్మన్ సూచించారు. చర్చా సమయం పంపిణీ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం వైపు నుండి వివరణ ఇచ్చేటప్పుడు సమయంతో సంబంధం లేకుండా పూర్తి వివరాలు వెల్లడించడానికి అవకాశం ఇవ్వాలని మంత్రులు కోరారు.

ఇవి కూడా చదవండి: Mallu Ravi Wife: డిప్యూటీ సీఎం వదినకు.. నగరం నడిబొడ్డున కోట్లు విలువ చేసే సర్కారు జాగ..

చర్చ ముదురుతున్న కొద్దీ శాసనమండలిలో యుద్ధ వాతావరణం కనిపించింది. నెయ్యి కల్తీ అంశంపై వాగ్వాదం జరుగుతుండగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సభ్యుడు తుమాటి మాధవరావు మధ్య తీవ్ర స్థాయిలో దూషణలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై ఒకరు భౌతికంగా దాడికి దిగేంతగా సభ్యులు దూసుకెళ్లడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే ఇతర సభ్యులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. నిష్పాక్షికంగా చర్చ జరగాల్సిన సభ కాస్తా వ్యక్తిగత దూషణలు, గందరగోళంతో అట్టుడికిపోయింది. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన ఈ అపచారంపై స్పష్టమైన విచారణ జరగాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని కూటమి ప్రభుత్వం పట్టుబడుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *