ఈ బడ్జెట్లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, అమరావతి అభివృద్ధి, రహదారులు, ఇతర మౌలిక వసతులపై ప్రధాన కేటాయింపులు ఉండే అవకాశముంది. మూడు ఆర్థిక మండలాలు, రాయలసీమ ఉద్యాన హబ్ వంటి ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
బడ్జెట్ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ వివరాలను వెల్లడిస్తారు. మండలిలో సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్‌ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమ రంగానికి కూడా భారీ నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీపం 2.0, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉండొచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. రాష్ట్ర ప్రజలు ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.


