Last Updated:
Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటి. ఐరన్ లోపం, అధిక రక్తనష్టం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే రక్తహీనతను 70 శాతం వరకు నివారించవచ్చు.
Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటని బుచ్చంపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నల్ల సురేష్ తెలిపారు. ముఖ్యంగా ఐరన్ లోపం, అధిక రక్తనష్టం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన తెలిపారు.సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే రక్తహీనతను 70 శాతం వరకు నివారించవచ్చని తెలియజేశారు.
మహిళల్లో రక్తహీనతకు ప్రధాన కారణంగా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోకపోవడమేనని డాక్టర్ నల్ల సురేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని అన్నారు. రెండవ ముఖ్య కారణం నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కావడం. కొంతమంది మహిళల్లో మెన్స్ట్రువల్ బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుందని తెలిపారు.
చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య కూడా రక్తహీనతకు దారి తీస్తుందని ఆయన తెలిపారు. పేగుల్లో ఉండే ఈ పురుగులు రక్తాన్ని పీల్చడం వల్ల పిల్లల్లో బలహీనత, అలసట, వృద్ధి లోపం వంటి సమస్యలు కనిపిస్తాయని వివరించారు. అదేవిధంగా క్రానిక్ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కూడా రక్తహీనత సాధారణంగా కనిపిస్తుందని అన్నారు.కిడ్నీ పనితీరు తగ్గిపోతే రక్త కణాల ఉత్పత్తి తగ్గి అనీమియా వస్తుందని వెల్లడించారు.
కొంతమందిలో గ్యాస్ట్రిక్ అల్సర్లు, హేమరాయిడ్స్ (పైల్స్) వంటి సమస్యల వల్ల కూడా అంతర్గత రక్తస్రావం జరుగుతూ ఉండి రక్తహీనతకు కారణమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా రక్తనష్టం జరుగుతున్నప్పటికీ చాలా మంది దానిని పట్టించుకోరని, ఫలితంగా పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరించారు.
రక్తహీనతకు అసలు కారణం ఏమిటో తెలుసుకుని సరైన చికిత్స తీసుకోవడం అవసరమన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఐరన్ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకోవాలని డాక్టర్ నల్ల సురేష్ సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలికలు ఈ మాత్రలను తప్పనిసరిగా వాడాలని అన్నారు. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఆకుకూరలు తోటకూర, పాలకూర, జనపకూర వంటి వాటిని తరచుగా ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. మాంసాహారం తీసుకునేవారు మాంసం, కాలేయం వంటి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెప్పారు. అదేవిధంగా కొన్ని పండ్లు, పప్పులు, ధాన్యాలు కూడా ఐరన్ సమృద్ధిగా కలిగి ఉంటాయని వివరించారు. విటమిన్ సి ఉండే నిమ్మరసం వంటి పదార్థాలను తీసుకుంటే ఐరన్ శరీరానికి సులభంగా శోషించబడుతుందని తెలిపారు.
రక్తహీనత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలసట, తలనిరుత్తరం, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పసుపురంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదన్నారు.సమగ్ర అవగాహనతో, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనత సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్ నల్ల సురేష్ స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం పోషకాహారంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హోమ్ రెమిడీస్, పేరెంటింగ్ టిప్స్, రిలేషన్‌షిప్ గైడెన్స్, ఫిట్‌నెస్, యోగా టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ స్టోరీస్‌ని న్యూస్ 18 తెలుగు లైఫ్‌స్టైల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh
Mar 05, 2026 12:17 PM IST


