Last Updated:
యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు ఆరోపించడంతో పాలవలస గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
Andhra Pradesh: అర్ధరాత్రి వేళ ప్రేమించిన యువతిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి ఉదంతం తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు దారితీసింది. యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు ఆరోపించడంతో పాలవలస గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనాడు కథనం ప్రకారం.. ఆనందపురం మండలం చందక పంచాయతీ పరిధిలోని యడ్లవారి కల్లా గ్రామానికి చెందిన ఓ 21 ఏళ్ల యువకుడు ఇంటర్ చదువుతున్నాడు. అదే మండలంలోని పాలవలసకు చెందిన యువతితో అతనికి గతంలోనే పరిచయం ఉంది. కొంతకాలం వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగినట్లు సమాచారం. అయితే, మధ్యలో కొన్ని కారణాల వల్ల కొన్నేళ్లపాటు ఒకరికొకరు దూరంగా ఉన్నారు.
రాజమహేంద్రవరానికి చెందిన సదరు యువతి తండ్రి చనిపోవడంతో, ఆమె మేనమామలు బాధ్యత తీసుకుని యువతిని, ఆమె తల్లిని, తమ్ముడిని పాలవలసకు తీసుకువచ్చారు. అక్కడ వారు నివాసం ఉంటూ యువతిని చదివిస్తున్నారు. సుమారు నాలుగు నెలల క్రితం యువతికి, ఆ యువకుడికి మధ్య మళ్ళీ పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది.
గత శనివారం రాత్రి యువతి తనను కలవాలని ఫోన్ ద్వారా యువకుడికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. యువకుడు రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా యువతి బయటకు వెళ్ళింది. చాలా సేపటి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు.
సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం మేడపై వీరిద్దరూ ఉన్నట్లు గుర్తించిన యువతి తరపు బంధువులు అక్కడికి వెళ్లారు. కొద్దిసేపటికే ఆ యువకుడు మేడ మీద నుండి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడిని విశాఖలోని కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు.
ఈ ఘటనపై రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తాము మేడ పైకి వెళ్ళగానే యువకుడు భయంతో అక్కడి నుంచి దూకేశాడని వారు వాదిస్తున్నారు. తమ అబ్బాయిని మేడ మీద నుంచి దూకలేదని, యువతి తరపు వారు అతడిని తీవ్రంగా కొట్టి కిందకు తోసేసి హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు యడ్లవారి కల్లా గ్రామానికి చెందిన ప్రజలు ఆనందపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, వేలి ముద్రల బృందం మరియు జాగిలాలు ఆధారాలను సేకరించాయి. యువకుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆనందపురం సిఐ వాసునాయుడు తెలిపారు. అసలు ఇది ప్రమాదమా, ఆత్మహత్యా ప్రయత్నమా లేక దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇలాంటి భేటీలు ప్రాణాల మీదకు వస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



