Last Updated:
పుట్టిన సమయంలో బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం బాబుకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా శిశువు శరీర రంగు మారిపోయింది.
Anakapalli: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ తమకు దూరమయ్యాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే..
కసింకోట గవరపేట వీధికి చెందిన వేగి శ్రీనివాసరావు భార్య తులసి ప్రసవం కోసం ఈ నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేరారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఒక బాబుకు జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం బాబుకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా శిశువు శరీర రంగు మారిపోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్ వద్దకు పరుగెత్తారు.
ఆ సమయంలో వార్డులో సంబంధిత డాక్టర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. పరిస్థితి విషమించడంతో క్యాజువాలిటీ నుండి డ్యూటీ డాక్టర్ వచ్చి బాబును వార్మర్ బాక్సులో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సాయంత్రం 5 గంటల సమయంలో బాబు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆసుపత్రిలో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడమే బాబు మృతికి ప్రధాన కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పసికందు మృతికి కారణమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. “ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మా బిడ్డను మాకు కాకుండా చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటనలు మరో తల్లికి కడుపు కోత మిగల్చకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రస్తుతం ఆసుపత్రి వద్ద పోలీసులు మోహరించారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏదేమైనా, అధికారుల సమన్వయ లోపం, మౌలిక సదుపాయాల కొరత ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం సమాజానికి తీరని వేదన మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



