ఎన్నికల ప్రచారానికి తెర – Visalaandhra


తమిళనాడులో రేపు పోలింగ్
బెంగాల్‌లో మొదటిదశకు కూడా…

చెన్నై/కోల్‌కతా: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు తప్పనిసరి 48 గంటల నిశ్శబ్ద కాలం అమలులోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు, ఇతర ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ఛానెళ్లతో సహా డిజిటల్, ఎలక్ట్రానిక్ వేదికలకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానాలు లేదా రెండూ విధించబడతాయి. తమిళనాడుకు సంబంధించి మొత్తం 234 శాసనసభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులు. మద్దతును పటిష్టం చేసుకునే చివరి ప్రయత్నంగా రాజకీయ అగ్ర నాయకులు విస్త్రత ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఇంటింటి ప్రచారం, స్థానిక ప్రజలతో సంభాషణలపై దృష్టి సారిస్తూ తన చివరి విడత ప్రచారం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె.పళనిస్వామి సేలంలో తన ప్రచారం ముగించారు. నాన్ తమిళర్ కచ్చి అధిపతి సీమాన్ కరైకుడిలో ప్రచారం చేయగా, తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకుడు విజయ్ చెన్నైలో తన ప్రచారాన్ని ముగించారు. ఎన్నికల పోరు ప్రధానంగా డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్‌పీఏ), ఏఐఏడీఎంకే నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మధ్య జరుగుతోంది. డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షాలు 70 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. మరోవైపు, ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతుండగా, దాని భాగస్వాములు 65 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. నటుడు విజయ్ తొలిసారిగా నాయకత్వం వహిస్తున్న ‘తమిళగ వెట్రి కజగం’ మొత్తం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం 4,023 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తుండగా, 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా.
బెంగాల్‌లో 152 స్థానాలకు పోలింగ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఏప్రిల్ 23 న జరిగే మొదటి దశలో మొత్తం 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. బరిలో 1,478 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులు చివరి నిమిషంలో ప్రచారాన్ని పూర్తి చేశారు. అమిత్ షా కుర్సియోంగ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మరోవైపు, మమతా బెనర్జీ హల్దియాలో బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్, వామపక్షాలతో సహా ఇతర పార్టీలు కూడా చివరి దశలో నియోజకవర్గాల వ్యాప్తంగా విస్త్రతంగా ప్రచారం చేశాయి. 294 మంది సభ్యులు కలిగిన పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. రెండో దశలో ఏప్రిల్ 29 న మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4 న చేపడతారు. ప్రస్తుత శాసన సభ పదవీ కాలం మే 7 న ముగుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *