ఆఖరి అస్త్రంగా జ్ఞానేశ్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు


అరుణ్ శ్రీవాస్తవ

లోక్‌సభ్ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం మూజువాణీ ఓటుతోనే వీగిపోయింది. అయినా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ, లోక్‌సభకు చెందిన 193 మంది గత 13వ తేదీన ఇంపీచ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాల ఈ ప్రయత్నం నెగ్గుతుందనుకోలేం. కానీ ఇదీ ఒక రకమైన అభిశంసనే. ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి “పక్షపాత ధోరణి” అనుసరిస్తున్నారని, “ఓట్ చోరీకి సహకరిస్తున్నారు” అని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తున్నాయి. ఎన్నికలలో అధికార పార్టీ పాల్పడే అక్రమాలను జ్ఞానేశ్ కుమార్ బొత్తిగా పట్టించుకోవడం లేదు. ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) పేర దళితుల, అణగారిన వర్గాల, ముస్లింల పేర్లను పనిగట్టుకుని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.జ్ఞానేశ్ కుమార్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికి బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఆయన పర్యవేక్షణలోనే వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. జ్ఞానేశ్ కుమార్‌ను ఇంపీచ్ చేయడానికి తగినంత సంఖ్యాబలం ఉభయసభల్లో ప్రతిపక్షాలకు లేని మాట నిజమే. స్పీకర్‌ను తొలగించాలని కోరినా, చివరకు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా అది కచ్చితంగా నెగ్గుతుందన్న వాస్తవం ప్రతిపక్షాలకు తెలియక కాదు. నిరసన వ్యక్తం చేయడానికి ఇది ఒక మార్గం.ఈ ఇంపీచ్‌మెంట్ ప్రయత్నం విఫలమైనా జ్ఞానేశ్‌కుమార్ నడవడికలో మార్పు ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి దీక్షాబద్ధుడై ఉన్నారు. ఎన్నికల కమిషన్ ప్రధానాధికారుల్లో అంత సమర్థులు కానివారిని చూశాం. కానీ బాహాటంగా ప్రభుత్వం కొమ్ము కాస్తున్నది మాత్రం జ్ఞానేశ్‌కుమార్ ఒక్కరే. ఇంపీచ్‌మెంట్ ప్రయత్నాలు వీగిపోయినంత మాత్రాన ఆయన ఒడిగట్టిన అక్రమాల ముద్ర చెరిగిపోదు. జ్ఞానేశ్ కుమార్ పాల్పడుతున్న అక్రమాలను ఎండగట్టడానికి ప్రతిపక్షాలు చేయగలిగినదంతా చేశాయి. ఆయన తీరు మారలేదు. పని చేసే విధానంలోనూ మార్పు లేదు. ఎస్.ఐ.ఆర్. విషయంలో సుప్రీంకోర్టును సైతం పెడదారి పట్టించిన ఘనుడాయన. ఆయన వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లినా అత్యున్నత న్యాయస్థానం పరిస్థితిని చక్కదిద్దడానికి పెద్దగా చేసిందేమీ లేదు. పైగా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలలో ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి వాదనలను గుడ్డిగా నమ్మినట్టు ప్రవర్తించింది. ఆధార్ కార్డును సైతం గుర్తింపు పత్రంగా అంగీకరించాలని బిహార్ రగడ సందర్భంగా చెప్పడం మాత్రమే అత్యున్నత న్యాయస్థానం కలిగించిన ఊరట. జ్ఞానేశ్‌కుమార్‌ను ఇంపీచ్ చేయడానికి తగిన సంఖ్యాబలం ప్రతిపక్షాలకు లేదు కనక ఆ ప్రయత్నమే అనవసరం అన్నది దండగమారి వాదన. ప్రజాస్వామ్యానికి మూలకందమైన ఎన్నికల వ్యవస్థలో అక్రమాలు జరుగుతూ ఉంటే సంఖ్యాబలం లేదన్న కారణంతో ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని కూర్చోవాలని కాదుగా! ఇంపీచ్ మెంట్ నోటీసు ఇవ్వడం ఓ బలమైన నిరసన మార్గం. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అసమ్మతికి స్థానమే లేకుండా చేస్తున్నారు. నిరసన తెలియజేసే వారి మీద అక్రమంగా చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం లాంటి కఠిన చట్టాల కింద కేసులు మోపి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేట్టు చేస్తున్నారు.జ్ఞానేశ్ కుమార్ కేవలం పక్షపాత ధోరణి అనుసరించడం మాత్రమే కాదు. ఎస్.ఐ.ఆర్. ఒక పెద్ద మోసం. అధికార పార్టీ విజయానికి సోపానాలు వేయడం. ఇది మోదీ సర్కారు రాజకీయ వ్యూహంలో భాగం. ప్రతిపక్షాలను నోరెత్తనివ్వకుండా చేసే ఎత్తుగడ. దానికి జ్ఞానేశ్ పూర్తి వత్తాసు. లోకసభ స్పీకర్ కూడా మోదీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ తరించిపోతున్నారు. ఆయన మీద ప్రతిపక్షాల తీర్మానం వీగి పోయి ఉండొచ్చు. కానీ ఆయన మీద పడ్డ మచ్చ మాత్రం చెరిగిపోయేది కాదు. మోదీ సర్కారు ఓం బిర్లాను వెనకేసుకొస్తున్నట్టే ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌నూ కాపాడుతోంది. ప్రతిపక్షాల విషయంలో జ్ఞానేశ్‌కుమార్ వైఖరి దురుసుగా మాత్రమే కాదు అమర్యాదకరంగా ఉంది. ప్రతిపక్ష నాయకులు ఏదో విషయం చర్చించడానికి వెళ్లాలంటే ఆయన దర్శన భాగ్యమే పెద్ద ప్రయత్నం. తీరా దర్శనం ఇచ్చాక జ్ఞానేశ్‌కుమార్ అర్ధంతరంగా వెళ్లిపోయిన సందర్భాలకు కొదవే లేదు. ఓం బిర్లా నడవడిక పార్ల్లమెంటు రికార్డులలో నిక్షిప్తం అయినట్టే జ్ఞానేశ్ కుమార్ మీద ఇంపీచ్ మెంట్ ప్రయత్నం సైతం పార్లమెంటు రికార్డులలో భద్రంగా ఉంటుంది. జ్ఞానేశ్ కుమార్ కచ్చితంగా దోష ప్రకరణంలో ప్రధానాంశంగా మిగిలిపోక తప్పదు. పార్లమెంటు ఒక రాజకీయ వేదిక. అక్కడ విధానాల మీద చర్చ జరగాలి. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలకు సంపూర్ణ అవకాశం ఉండాలి. పార్లమెంటులో వ్యక్తమయ్యే నిరసనను “రాజకీయం” అని కొట్టిపారేయడం హ్రస్వ దృష్టికి నిదర్శనం. అసమ్మతికి తావు లేకుండా చేయడమే. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య సౌధం రాయి రాయి విడగొట్టడమే. ఓటర్ల జాబితా సవరణ ముసుగులో జరుగుతున్న అవకతవకలను పార్లమెంటులో చర్చకు పెట్టడం ప్రభుత్వం జవాబుదారీతనాన్ని పదిలపరచడమే. సుప్రీం కోర్టు ఇచ్చిన నామ మాత్ర ఆదేశాలను అమలు చేయడానికి కూడా జ్ఞానేశ్ కుమార్ కాళ్లీడ్చిన వైనం కళ్లార చూశాం. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఎస్.ఐ.ఆర్. నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రక్రియ కొనసాగిన అన్ని రాష్ట్రాలలోనూ జాబితాలో చేర్చిన కొత్త ఓటర్లకంటే తొలగించిన ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయాన్ని సుస్థిరం చేయడం కాక మరేమిటి? ఎన్నికల కమిషన్ పని తీరుపై సుప్రీం కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ దాపరికం లేకుండా పని చేయడం లేదని, నిజాయితీ లోపించిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడాన్ని విస్మరించడం కుదిరే పని కాదు. ఓటర్ల జాబితాలో తొలగించిన పేర్ల వ్యవహారం పరిష్కరించడానికి బెంగాల్‌లో పదవీ విరమణ చేసిన, లేదా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం కన్నా పెద్ద విమర్శ ఏమీ ఉండదు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా జ్ఞానేశ్ కుమార్‌ను ఇంపీచ్ చేయడానికి ప్రయత్నించడం కన్నా ప్రతిపక్షాలకు వేరే దారే లేకుండా పోయింది. అది కూడదంటే మోదీ, షా పాల్పడుతున్న అఘాయిత్యాలను సమర్థించడమే. అర్హులైన వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చడమే ఎన్నికల కమిషన్ పని. కానీ తాము పౌరులమేనని నిరూపించుకోవాలని ఎన్నికల కమిషన్ నిర్బంధ పెడ్తోంది. పౌరసత్వాన్ని ప్రశ్నించడానికి ఎన్నికల కమిషన్‌కు వీలే లేదు. ఇది లేని అధికారాన్ని వినియోగించుకోవడమే. అంటే అధికార దుర్వినియోగమే.

The post ఆఖరి అస్త్రంగా జ్ఞానేశ్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *