పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష – న్యాయస్థానం తీర్పు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఒక మైనర్‌పై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె. నాగమణి. 2024 మే 22న బాలిక అదృశ్యమవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26) బాలికను పెళ్లి చేస్తానని నమ్మించి పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు, సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పించబడ్డాయి. నేరం నిరూపితమైన తరువాత, న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. సత్యం వాదనలు వినిపించారు. డిఎస్పి ఆర్. గోవిందరావు దర్యాప్తును పర్యవేక్షించారు. సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ పి. సూర్యకుమారి మరియు ఇతర పోలీసులు సమన్వయంతో పనిచేసి కేసును బలంగా నిలిపారు. జిల్లా ఎస్పి ఎఆర్ దామోదర్ ఈ కేసును ఛేదించిన అధికారులను అభినందించారు. బాలలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *