Last Updated:
మార్చి 23 నక్కపల్లి సమీప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో పాయకరావుపేటలో 80 వేల ఉద్యోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంగలపూడి అనితలు చెబుతున్నారు.
మార్చి 23 తేదీ ఆంధ్రప్రదేశ్‌కు కీలక ఘట్టంగా నిలవనుంది. రాష్ట్ర అభివృద్ధి దిశలో మరో పెద్ద అడుగుగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి ప్రభుత్వం ఘనంగా సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు కరపత్రాలు పంచుతున్నారు. దేశంలోనే ప్రత్యేకంగా నిలిచే ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడిస్తోంది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి సమీపంలో సుమారు 5000 ఎకరాల్లో ఈ భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
సాధారణ టీచర్‌గా జీవితం ప్రారంభించి, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా ఎదిగి ప్రస్తుతం హోంమంత్రిగా సేవలందిస్తున్న వంగలపూడి అనితకు ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మారింది. తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పాయకరావుపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పిన ఆమె, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని స్థానికులు భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌తో పాటు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, రోడ్డు విస్తరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం వారం రోజులుగా హోంమంత్రి స్వయంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, తుని ఎమ్మెల్యే యనమల దివ్యలు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. మొత్తం మీద ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో పాయకరావుపేట నియోజకవర్గం దేశ దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


