Last Updated:
విజయనగరం జిల్లాలో 2017 గంజాయి రవాణా కేసులో 9 మంది నిందితులకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ఎం.మీనాదేవి రూ.1 లక్ష జరిమానా విధించారు.
విజయనగరం జిల్లాలో 2017లో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి రవాణా కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో 9 మంది నిందితులకు విజయనగరం ఫస్ట్ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి ఎం.మీనాదేవి గురువారం తీర్పు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం 2017 ఆగస్టు 23న గంట్యాడ పోలీసులకు అందిన సమాచారంతో కొటారుబిల్లి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బొడ్డవర వైపు నుంచి అనుమానాస్పదంగా వేగంగా వస్తున్న మూడు వాహనాలను పోలీసులు ఆపి తనిఖీ చేయగా భారీగా గంజాయి బయటపడింది. బొలేరో, ఎక్స్‌యూవీ 500, స్విఫ్ట్ డిజైర్ వాహనాల్లో మొత్తం 32 గోనె సంచుల్లో సుమారు 641 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఎ-1గా ఎఎస్ఆర్ జిల్లా అరకు మండలం లోతేరు గ్రామానికి చెందిన పట్టాసి చంద్రశేఖర్, ఎ-2గా అనంతగిరి మండలం శివలింగాపురానికి చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్, ఎ-3గా అరకు మండలం చోలెం గ్రామానికి చెందిన కొర్న మోసెస్ అలియాస్ అలీ, ఎ-4గా డుంబ్రిగూడకు చెందిన మద్యగురు సింహాద్రి, ఎ-5గా విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం టి.బొడ్డవరకు చెందిన శోభా నాగరాజు, ఎ-6గా డుంబ్రిగూడ మండలం పెద అంజోడకు చెందిన పంగి సన్యాసిరావు, ఎ-7గా అనంతగిరి మండలం ఎగువబూడికి చెందిన జన్ని అప్పారావు, ఎ-8గా శివలింగాపురానికి చెందిన దుడ్డు వీరభద్రరాజు తదితరులు నిందితులుగా ఉన్నారు.
ఈ కేసును అప్పటి గంట్యాడ ఎస్ఐ పి.నారాయణరావు నమోదు చేయగా, విజయనగరం రూరల్ సిఐ డి.లక్ష్మణరావు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణ సమయంలో సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో నిందితులపై నేరం రుజువై కోర్టు 9 మందికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది సాధారణ జైలుశిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో నిందితుల్లో ఒకరైన గేదెల ధర్మతేజ విచారణ సమయంలో అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్‌పై వివిధ జిల్లాల్లో ఏడు గంజాయి కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన సుమారు రూ.2.5 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే అధికారులు జప్తు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎం.శైలజ, జి.సత్యం సాక్షులను విచారించగా, ఎం.ఖజానారావు వాదనలు వినిపించారు. గంట్యాడ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ డి.రాధిక, సి.ఎం.ఎస్ కానిస్టేబుల్ కే.త్రినాధరావు సాక్షులను సమయానికి కోర్టుకు హాజరు పరచడంలో కీలక పాత్ర పోషించారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగం తీవ్రమైన నేరమని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు లేదా 1972 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh



