2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు


: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.
దీంతో తన పదవీకాలం ఐదేళ్లకు బదులు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేసి, ఆ తర్వాత 60 రోజుల్లో జనాభా లెక్కలను ప్రకటిస్తుందని తెలిపారు.వచ్చే ఏడాది మే-జూన్‌ నాటికి జనగణన ఫలితాలు వెలువడిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్‌ను ఏర్పాటు చేస్తారని చెప్పారు.

కిషన్‌రెడ్డి సత్య హరిశ్చంద్రుడైతే…
ఆ కమిషన్ ఏడాదిలోపే నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటుందని, అందుకే 2029లో కొత్త నియోజకవర్గాల ఆధారంగా జమిలి ఎన్నికలు తప్పనిసరిగా జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో జరుగుతున్న జాప్యానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే సమాధానం చెప్పాలని సీఎం వ్యాఖ్యానించారు.
ఆయన చేయకపోతే హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అయినా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు.ఫార్ములా-ఈ రేస్ కేసును ఈడీకి అప్పగించినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు.
అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాయబోతున్నామని తెలిపారు.

భారాస, ఎంఐఎంలతో కలిసి రాజకీయాలు చేస్తున్న భాజపా…
కిషన్‌రెడ్డి నిజంగా భారాసతో లోపాయికారీ ఒప్పందాలు లేని వ్యక్తి అయితే ఈ అన్ని కేసులపై విచారణ జరిపించాలన్నారు.తెలంగాణకు సంబంధించిన కేసుల విషయంలో సీబీఐకి సంపూర్ణ జనరల్ కన్సెంట్ ఇవ్వకపోయినా, కేస్ బై కేస్ అనుమతులు ఇస్తూనే ఉన్నామని తెలిపారు.నేను భారాసతో కుమ్మక్కయ్యానని కిషన్‌రెడ్డి ఆరోపిస్తుంటే, మరోవైపు భాజపాతో కలిసి రాజకీయాలు చేస్తున్నానని కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఆరోపిస్తున్నారని సీఎం చెప్పారు.
ముఖ్యమంత్రిగా తన బాధ్యత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మాత్రమేనని స్పష్టం చేశారు.
వాస్తవానికి భాజపానే ఒకవైపు భారాసతో, మరోవైపు ఎంఐఎంతో కలిసి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.అందుకే ఎంఐఎం అవసరమైన చోట్ల భాజపాకు పరోక్షంగా సహకరిస్తోందన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును భారత్‌కు రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని సీఎం తెలిపారు.20 నెలలపాటు న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను తీసుకురావాల్సి వచ్చిందన్నారు.పైనున్నవారి ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాప్ చేశామని ప్రభాకర్‌రావు విచారణలో చెప్పినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు.ఆ ఆధారాలతోనే ఇతరుల విచారణ కొనసాగిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ కేసులో సిట్‌కు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చానని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైనందున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో సిట్ పనిచేస్తోందని, ప్రస్తుతం సజ్జనార్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

కాళేశ్వరంలో నీరు నిలబెడితే 33 పిల్లర్లు కూలిపోయే ప్రమాదం…
కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లకు నష్టం జరిగినట్లు నిపుణులంతా చెబుతున్నారని సీఎం అన్నారు.
కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి మాత్రం 100 పిల్లర్లలో కేవలం మూడు మాత్రమే కుంగాయని, అవి రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పడం ప్రమాదకరమన్నారు.
వారి మాట ప్రకారం నీరు నిలబెడితే 33 పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాజెక్టు మొత్తం కుంగిపోతే బాధ్యతను ప్రభుత్వంపై నెట్టేందుకు కేసీఆర్ బృందం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ప్రతి పిల్లర్‌ను పరిశీలించాల్సిందేనని ఎన్డీఎస్‌ఏ సూచించిన నేపథ్యంలో, నష్టస్థాయిని అంచనా వేసే బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తుమ్మిడిహెట్టి నుంచి నీరు తరలించడమే మంచిది
కాళేశ్వరం ప్రాజెక్టుకు బాంబులు పెట్టామని కొందరు అవివేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.బాంబులు పెడితే ప్రాజెక్టు పైకి లేస్తుంది తప్ప భూమిలోకి కుంగిపోదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.1.02 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రూ.10 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.మిగిలిన పనులు పూర్తి చేయాలంటే మరో రూ.50-60 వేల కోట్లు అవసరమవుతుందని చెప్పారు.ప్రాజెక్టు ఉపయోగకరమా కాదా అనే సందేహం ఉన్నప్పుడు మరింత ఖర్చు చేయడం సబబా అనే ప్రశ్న తలెత్తుతోందని, అందుకే తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలించడమే మెరుగైన మార్గమని అభిప్రాయపడ్డారు.

ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌కు అనుకూలం
మక్తల్‌లో భాజపా కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై కిషన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరితే వెంటనే దర్యాప్తు కోరతానని సీఎం తెలిపారు.కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ఆయన తన రాజకీయ బాస్‌లైన కేసీఆర్, కేటీఆర్‌లను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

సింగరేణి టెండర్లపై అసెంబ్లీలో పూర్తి వివరణ
సింగరేణి టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీఎం స్పష్టం చేశారు.
సైట్ విజిట్ నిబంధన అన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, జాతీయ రహదారి టెండర్లలోనూ ఉందని, ఇది కొత్త నిబంధన కాదన్నారు.కేవలం స్వీయ ధ్రువీకరణపత్రం సరిపోతుందన్న కిషన్‌రెడ్డి వాదన వాస్తవం కాదన్నారు.ఈ అంశానికి సంబంధించిన అన్ని పత్రాలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉంచి మాట్లాడతానని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిపై అదనపు భారం మోపలేదని, ప్రస్తుతం ఉన్న భారమంతా కేసీఆర్ హయాంలో వచ్చినదేనన్నారు.

అమీర్‌పేటలో ఎన్టీఆర్‌ విగ్రహం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను తాను కూడా సమర్థిస్తున్నానని, ప్రస్తుతం ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, అవసరమైతే పార్టీలో చర్చిస్తానన్నారు.

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఏమిచ్చారు, తెలంగాణకు ఏమిచ్చారన్న పోలికకు తాను వెళ్లబోనని సీఎం స్పష్టం చేశారు.ఇక్కడ తానే రాజు, తానే మంత్రి అని వ్యాఖ్యానిస్తూ, అందరూ తనతో పోల్చుకోవాలి తప్ప తాను ఎవ్వరితోనూ పోల్చుకోనని అన్నారు.

మార్చి 31లోపు హైదరాబాద్ మెట్రో విలీనం
హైదరాబాద్ మెట్రో విలీన ప్రక్రియను మార్చి 31లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు.మొదటి దశ మెట్రోపై ఎల్‌అండ్‌టీకున్న రూ.13 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు.మూలధన వ్యయం కింద సంస్థ పెట్టిన రూ.6 వేల కోట్లను రూ.2 వేల కోట్లకు తగ్గించి, ఆ మొత్తాన్ని చెల్లించి పూర్తి ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
అనంతరం రెండో దశ ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతామని చెప్పారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దూరమని సీఎం అన్నారు.
ఆల్యాబ్ సాక్ష్యాధారాల నిల్వ కేంద్రం కాదని,విశ్లేషణ చేసి తిరిగి ఆయా సంస్థలకు అందించే ప్రయోగశాల మాత్రమేనని వివరించారు.ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా అప్పట్లో తిరిగి ఇచ్చేశామని పోలీస్ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు.
హార్వర్డ్ శిక్షణ ఖర్చు పూర్తిగా నా వ్యక్తిగతమే
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన శిక్షణకు అయిన ఖర్చు మొత్తం వ్యక్తిగతమేనని సీఎం స్పష్టం చేశారు.
40దేశాల నుంచి వచ్చిన 60మంది లీడర్లు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని,రాజకీయ నాయకులు ఇద్దరే ఉండగా మిగతా వారు వ్యాపారవేత్తలేనన్నారు.21వ శతాబ్దంలోని నాయకత్వ సవాళ్లపై శిక్షణ ఇచ్చారని, ప్రపంచవ్యాప్తంగా లీడర్లతో నెట్‌వర్క్ ఏర్పరుచుకునేందుకు ఇది ఉపయోగపడిందన్నారు.

ఒక్కో నదికి ఒక్కో విధానం అంగీకరించం
ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జలవివాదాలను పరిష్కరించుకోవడానికి తెలంగాణకు అభ్యంతరం లేదని సీఎం తెలిపారు.కృష్ణా, గోదావరి ట్రైబ్యునళ్లు కేటాయించిన వాటా ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ఎన్‌వోసీ ఇస్తే, వారు వరద జలాలు వాడుకోవడానికి తాము అంగీకరిస్తామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు విభజన చట్టం ప్రకారం కొనసాగుతున్నవేనని, అయినప్పటికీ వాటిపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడం అన్యాయమన్నారు.

ఒక్కో నదికి ఒక్కో విధానం అంగీకరించం
గోదావరిలో 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని చెబుతున్న ఏపీ, తెలంగాణకు కేటాయించిన 960 టీఎంసీల వినియోగానికి ఎన్‌వోసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నికర జలాలపై పూర్తి హక్కు ఇచ్చినప్పుడే మిగులు జలాలను పంచుకోవడానికి సిద్ధమని తెలిపారు.
కృష్ణా, గోదావరి రెండింటికీ ఒకే సూత్రం వర్తించాలే తప్ప ఒక్కో నదికి ఒక్కో విధానం అంగీకరించమన్నారు.
గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తున్నప్పుడు, రెండు బేసిన్లను వేర్వేరుగా చూడాలని ఎలా అడుగుతుందో ప్రశ్నించారు.గోదావరి జలాల పునఃపంపిణీ కోసం కొత్త ట్రైబ్యునల్ కోరడం లేదని కూడా స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *