Last Updated:
విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవం ఉగాది పర్వదినంతో ప్రారంభమైంది. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర మార్చి 31న ప్రధాన పండుగతో ముగుస్తుంది.
విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. 14 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది. ఉగాది పర్వదినంతో ప్రారంభమైన ఈ జాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతూ, మార్చి 31న ప్రధాన పండుగ జరగనుంది. నగర జీవనశైలిలోనూ ఈ జాతర పల్లె వాతావరణాన్ని తీసుకువచ్చి భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ అమ్మవారి చరిత్ర సుమారు 900 సంవత్సరాల నాటి అని పురోహితులు చెబుతున్నారు. విశాఖ సాగర తీరంలో జాలర్లకు అమ్మవారి విగ్రహం లభించిందని, ఆ తర్వాత అమ్మవారు కలలో ప్రత్యక్షమై తనను పెద్ద వాల్తేరులోని మద్ది వంశీయులకు అప్పగించాలని సూచించిందని చెబుతారు. అప్పటి నుంచి ఈ అమ్మవారు 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచి, ప్రతి సంవత్సరం జరిగే జాతర మహోత్సవం విశేష భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది.
జాతర ప్రారంభం నుంచే సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో పెదవాల్తేరు ప్రాంతం మొత్తం పల్లె పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. గ్రామాల్లో ఎక్కడ ఉన్నా ప్రజలు సారె తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి కుటుంబం తమ భక్తిని వ్యక్తపరుస్తూ ఈ సాంప్రదాయాన్ని కచ్చితంగా పాటించడం విశేషం.
ఈ అమ్మవారిని “జీడిపళ్ళ అమ్మవారు” అని కూడా పిలుస్తారు. జాతరలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టం జీడిపళ్ళ సమర్పణ. భక్తులు గుడి ప్రధాన గోపురం వైపు జీడిపళ్ళు విసురుతారు. ఆ జీడిపండు గుడిలోపలికి వెళ్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల గాఢ నమ్మకం. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర అనంతరం ప్రధాన పండుగ రోజున ఈ జీడిపళ్ళ జాతర అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.
వారం రోజుల పాటు 14 గ్రామాల ప్రజలు ఒక్కొక్కరుగా సారె తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ఈ ఉత్సవానికి మరింత ప్రత్యేకతను చేకూర్చుతోంది. విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారు కూడా ఈ జాతరకు ప్రత్యేకంగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించి తిరిగి వెళ్తారు. పెళ్లైన ఆడపిల్లలు అత్తవారింటి నుంచి వచ్చి అమ్మవారికి సారె పెట్టడం ఈ పండుగలో ఒక ఆచారంగా కొనసాగుతోంది.
మొత్తంగా పోలమాంబ జాతర విశాఖలో కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. భక్తి, సంప్రదాయం, కుటుంబ బంధాల కలయికగా నిలుస్తోంది. ప్రతి ఏడాది కనుల విందుగా జరిగే ఈ జాతర భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ, నగరంలో పల్లె సంస్కృతిని సజీవంగా ఉంచుతోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


