Last Updated:
Chittoor జిల్లాలో వెంకట్రావ్ 13 కోట్ల చీటీ మోసం చేసి పరారయ్యాడు. 400 మందికి పైగా బాధితులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చిత్తూరు జిల్లాలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చి వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్క రాత్రిలో మాయమైపోవడంతో దినసరి కూలీలు, పూల వ్యాపారులు, చిరు వ్యాపారులు, రైతులు, గొర్రెల కాపరులు లబోదిబోమంటున్నారు. నమ్మకమే పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఇప్పుడు అందనంత దూరంగా వెళ్లిపోయింది.
చిత్తూరు (Chittoor) జిల్లాలోని పలమనేరు పట్టణం బోయ వీధికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి గత కొంతకాలంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తూ స్థానికుల విశ్వాసం సంపాదించాడు. చిన్నచిన్న మొత్తాలతో ప్రారంభమైన చీటీలు క్రమంగా పెద్ద మొత్తాలకు చేరాయి. పిల్లల పెళ్లిళ్లు, కొత్త ఇళ్లు, భవిష్యత్ అవసరాల కోసం సంవత్సరాలుగా కూడబెట్టిన సొమ్మును ఆయన చేతిలో పెట్టారు. కానీ డబ్బులు తిరిగి చెల్లించే సమయం రాగానే వెంకట్రావ్ తాను దివాళా తీశానని ‘ఐపీ’ ప్రకటించి ఇంటికి తాళం వేసి పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
సుమారు 13 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 400 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తే ఖాళీ ఇల్లు దర్శనమివ్వడంతో షాక్కు గురైన బాధితులు పెద్ద సంఖ్యలో వెంకట్రావ్ నివాసం వద్దకు చేరుకుని తాళం వేసి ఆందోళన చేపట్టారు. మా కష్టార్జితం, పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు పోయింది.. మాకు న్యాయం చేయండి అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నిందితుడు ఎక్కడికి పారిపోయాడు? వసూలు చేసిన డబ్బును ఎక్కడికి మళ్లించాడు? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నమ్మిన వ్యక్తే నట్టేట ముంచడంతో పలమనేరు పట్టణంలో ఆగ్రహావేశాలు చెలరేగాయి. కష్టపడి దాచుకున్న ప్రతి రూపాయి వెనుక ఉన్న కష్టాన్ని గుర్తుచేసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 13 కోట్ల చీటీ మోసం కేసు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడిని పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని అందరూ కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


