హ్యాపీ ఉగాది – Visalaandhra


చింతపట్ల సుదర్శన్

అర్ధరాత్రి దాకా దోమలతో ఫైట్ చేసి అలసిపోయిన డాంకీకి తెల్లవారుఝామున చల్లగాలికి కునుకు పట్టింది. తాను ఒకటి తలిస్తే డాగీ ఇంకొకటి తలుస్తుంది కదా. ఉండి ఉండి ‘భౌభౌ’లు మొదలుపెట్టింది. దీని కూసే టైం మొదలైందన్నమాట. ఎవడైనా అరుగు పక్కనించి నడుస్తూ కనపడ్డాడో, ఎదురుగ్గా ఉన్న వేపచెట్టు కొమ్మ ఏదైనా గాలికి ఊయల్లూగిందో. ఇక ఇది అరుపులు మొదలు పెట్టిందంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనట్టే అనుకుని కళ్ళు గట్టిగా ఒత్తి పట్టుకుంది. కళ్లయితే మూయగలిగింది కానీ చెవులు మూయలేదుగా. అసలు ఇవాళ ఇది ఇంత పెందరాళే ఇలాగ అరవడానికి కారణమేమై ఉండునో అని ఆలోచించసాగింది డాంకీ. ఇప్పుడు దీని అరుపులో ఏదో ప్రత్యేకత ఉన్నట్టనిపిస్తున్నది. ఒక అరుపు అరుస్తుంది. కాస్సేపు గ్యాపు ఇచ్చి మళ్ళీ అరుస్తుంది. ఈ ‘రిథమిక్ క్రియేషన’ ఏమిటబ్బా అనుకుంది. మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా వింది. అవును సుమా ఇదేదో ‘జుగల్‌బందీ’ మాదిరి ఉందే అనుకుంది. ఇక నిదురించడం సాధ్యం కాదని కళ్లు తెరిచింది. ఒక విడత డాగీ అరుపు ఆ తర్వాత విరామ సమయంలో వేప చెట్టు మీది నుంచి ఓ పక్షిì ‘కూకూ’ గానం. ఓహో ఇదా విషయం అనుకున్న డాంకీ వేళాపాళా లేదూ నీకు డాగీ పొద్దున్నే ప్రెస్‌మీట్ పెట్టేవు అంది. ప్రెస్‌మీటా నేనేమన్నా అప్పోజిషన్ లీడర్నా కాదుగదా, వాళ్ళ కంటే బాగా అరవగలను కానీ అంది డాగీ అరవడం ఆపి. ఇంతకీ ఈ ఎర్లీ మార్నింగ్ సాంగ్ దేనికో అంది డాంకీ. దేనికేముందు ముంది ‘టిట్ ఫర్ టాట’. మాంచి నిద్ర పట్టబోతుంటే ఎక్కడ్నించి వచ్చిందో అది వేపచెట్టు మీద నించి ‘పర్‌ఫాÛర్మెన్స’ మొదలుపెట్టింది. నిద్ర తేలిపోయి, తిక్కెక్కె దాని కూతలకు సమాధానంగా నా ‘భౌభౌ’లు విసురుతున్నాను అంది డాగీ. ఆ వేప చెట్టు మీదకి వచ్చి పాడుతున్నది కోయిల. వసంతం వచ్చింది కదా. ఉగాది రానుంది కదా. దానికి పాడే సీజన్ ఇది. అందువల్ల పాడుతున్నది. అవి కూకూ కూతలు కావు. కమ్మని పాటలు బాగా విను. అది ఎప్పుడు పడితే అప్పుడు పాడదు. నీలాగా మూడు వందల అరవై అయిదు రోజులూ, ట్వంటీ ఫోర్ బై సెవన్ అరవదు. దానితో నీకు జుగల్‌బందీ అస్సలు సూటవదు. అనువుగాని చోట అధికుల మనరాదు కనక కాసేపు కర్కశ గానం ఆపు ఓ పది నిమిషాలన్నా ఈ ‘కోల్డ్ బ్రీజ’ని అనుభవించనీ అంది డాంకీ. నాది కర్కశగానమా అని ఆవేశ పడబోయింది డాగీ. నీది కాదు నాదేû అనుకో నాకు స్వస్వరూప జ్ఞానం ఉందిలే ‘జస్ట్ కిడ్డింగ’ అంతే అంటూ పళ్లు బయటపెట్టింది డాంకీ. అదిసరే కాని ఇందాక వసంతం అన్నావు ఉగాది అన్నావు. అదేం పండుగ నమలడానికి నాకేమైనా గిట్టుబాటవునా? నీకు పండగకు అర్థం అదేనా ఇది అలాంటి పండగేం కాదు. ప్యూర్ వెజిటేరియన్ ఫెస్టివల్. ఇళ్ళకి మావిడి తోరణాలు, కొత్త కుండలో వేపపూత, మామిడి ముక్కలు, బెల్లంతో ఉగాది పచ్చడి అంతే. ఉగాది పచ్చడా? అని ముఖంలో క్వశ్చన్ మార్క్ పెట్టింది డాగీ. అవును అన్ని రుచులూ అనగా ఆరు రుచులూ ఉంటయి దాంట్లో. ‘ఉగాదీ బజాయించు షహనాయీ, చేదు తీపి పులుపు రుబాయీ’ అన్నాడో కవి భాయీ. ఇంతకీ ఈ స్పెషల్ డిష్ ప్రత్యేకత ఏమిటో అంది డాగీ. ఎట్లాగూ నువ్వు తినలేని ఈ డిష్‌ని గ్యాసు అవసరం లేకుండా చేయవచ్చు. అసలే యుద్ధం కారణంగా గ్యాస్ కరువు వచ్చిందో, సృష్టించారో కాని దీన్ని మాత్రం గ్యాసు లేకుండా చేసుకోవచ్చు. అదన్న మాట స్పెషాలిటీ అని డాంకీ అంటూ వుంటే మార్నింగ్ వాక్‌కి వచ్చిన అబ్బాయి అరుగు ఎక్కేశాడు. అరె అప్పుడే తెల్లగా తెల్లవారేసిందా అంది డాంకీ. పొద్దున్నే ‘ఫేస్ టు ఫేస్ చాటింగ్ మొదలుపెట్టి తెల్లారిన విషయం పట్టించుకోలేదన్నమాట అని అబ్బాయి అంటూ వుంటే చెట్టుకొమ్మలో నుంచి కూ అంటూ కమ్మగా కూసింది. డాగీ జవాబు ఇవ్వాలనుకుంది కానీ ‘వద్దు’ అన్నట్టు డాంకీ తల అడ్డంగా ఊపింది. ఉగాదికి వెల్‌కం చెప్తున్నది కోయిల. ‘మావిచిగురు తినగానే కోవిల పలికేనా’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే కవి అన్నాడు అబ్బాయి. అవును సుమా నిన్న ఓ ఇంటి ఎదురుగ్గా నుంచుని ఉంటే ఎవడో మామిడి కాయను రాలగొట్టటానికి రాయి విసిరాడు కాయ రాలలేదు కానీ, నా వీపు పగిలేది, తప్పుకుని ఉండకపోతే. ఇంతకీ ఈ ఉగాది అనేది ఏమిటో, ఎందుకో అంది డాగీ. ఎందుకేమిటి పాత సంవత్సరం పాతదైపోయి కొత్త సంవత్సరం కొత్తగా ‘ఎంటర’ అవుతుందన్న మాట అంతేకదా ‘బ్రో’ అంది డాంకీ. సరిగ్గానే చెప్పావు. టీనేజి వాళ్ళు రొమాంటిక్ ఏజ్‌లోకి, ఆ ఏజ్‌లో ఉన్న వాళ్లు మధ్య వయసులోకి , ఆ వయసులో ఉన్న వాళ్లు ఓల్డ్ ఏజ్‌లోకి ఓ మెట్టు ఎక్కుతారన్నమాట. నాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అర్హత కోల్పోయే ఏజ్ దగ్గర పడుతుందన్నమాట అన్నాడు అబ్బాయి. ఈ సంవత్సరాలు రావడాలు, పోవడాలు మనుషులకే. మాకేం తేడా ఉండదు బర్త్‌డేలు చేసుకుంటామా, కొవ్వొత్తులు ఆర్పి కేకులు కోసుకుంటామా అంది. అందరి సంగతికేం కాని మా అన్నకి ‘హ్యాపీ ఉగాది’ చెబ్దామా అంది డాంకీ. ‘హ్యాపీ ఉగాది బ్రో’ అంటూ ‘జుగల్బందీ’ చేశాయి అవి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *