Last Updated:
అనంతపురం యువకుడు విజిత్ భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు హిమాలయాల్లో అరుదైన లెపార్డ్స్‌ను కెమెరాలో బంధిస్తూ డ్రోన్ పైలట్ విజువల్ స్టోరీ టెల్లర్గా మెరిసుతున్నాడు.
తనకి ఇష్టమైన రంగుల ప్రపంచంలో విహరించాలి అనే కల.. కానీ జీవితం మాత్రం అతన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు నడిపించింది. అయినా ఆ కలను వదిలిపెట్టకుండా కెమెరాను ఆయుధంగా మార్చుకుని హిమాలయాల ఎత్తుల్లో అరుదైన జీవులను బంధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు అనంతపురం యువకుడు విజిత్ భార్గవ్. ఉద్యోగం ఒక వైపు, అభిరుచి మరో వైపు.. ఈ రెండింటినీ సమతుల్యం చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అతని కథ నిజంగా ప్రేరణగా నిలుస్తోంది.
అనంతపురం నగరానికి చెందిన భార్గవ్ సాధారణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి జర్నలిస్ట్, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పటి నుంచే క్రియేటివిటీ వైపు ఆకర్షితుడైన అతనికి బీటెక్ చదువుతున్న రోజుల్లోనే ఫోటోగ్రఫీపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. కెమెరాతో కథలు చెప్పాలన్న తపన మొదలైంది. అయితే ఆ సమయంలో ఫోటోగ్రఫీ కోర్సు చేయాలంటే భారీ ఫీజులు కావడంతో ఆ కలను కొంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, ఆశ మాత్రం తగ్గలేదు.
అదే సమయంలో ఎంటెక్ ఎంట్రన్స్ రాసిన భార్గవ్ ఆల్ ఇండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. దీంతో అతని ప్రయాణం ఎంటెక్ వైపు మళ్లింది. బెంగళూరులో ఉన్న ప్రముఖ కాలేజీలో చదువుకుంటూనే తనలో ఉన్న క్రియేటివ్ స్పార్క్‌ను ఆరనీయకుండా చూసుకున్నాడు. చదువు, తర్వాత ఉద్యోగం ఇలా జీవితంలో బాధ్యతలు పెరిగినా, ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. ఖాళీ సమయాల్లో కెమెరాను పట్టుకుని విజువల్ స్టోరీ టెల్లింగ్ వైపు అడుగులు వేస్తూ తనకంటూ ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు.
ఈ ప్రయాణంలో అతనికి నిజమైన టర్నింగ్ పాయింట్ హిమాలయాలే అయ్యాయి. గత ఫిబ్రవరిలో అరుదైన లెపార్డ్స్‌ను చిత్రీకరించాలనే లక్ష్యంతో హిమాలయాలకు వెళ్లిన భార్గవ్, అక్కడి అనుభవాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మంచుతో కప్పుకున్న పర్వతాల మధ్య అరుదైన జంతువులను తన కెమెరాలో బంధించిన ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఒక్క వీడియోతోనే అతని ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
ఇదే కాకుండా అతని జీవితంలో మరో ఆసక్తికర సంఘటన కూడా చోటుచేసుకుంది. ఎంటెక్ చదువుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక ప్రముఖ దర్శకుడు రైటర్స్ కావాలని ఇచ్చిన పిలుపు చూసి వెంటనే తన స్క్రిప్ట్ పంపించాడు. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో అతనికి ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే చదువు కారణంగా ఫుల్ టైమ్ పనిచేయలేకపోయినా, వారంలో రెండు రోజులు మాత్రమే పని చేస్తూ ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. చివరకు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా ముందుకు వెళ్లాడు.
ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే తన అసలు ప్యాషన్ అయిన స్టోరీ టెల్లింగ్‌ను వదలకుండా కొనసాగిస్తున్నాడు భార్గవ్. డ్రోన్ పైలట్‌గా, ఫోటోగ్రాఫర్‌గా, విజువల్ స్టోరీ టెల్లర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో పూర్తిగా స్టోరీ టెల్లింగ్ వీడియోలపైనే దృష్టి పెట్టాలని, ప్రపంచానికి కొత్త కథలను చూపించాలని అతని లక్ష్యం. పరిస్థితులు అడ్డుకున్నా కలలను వదలకుండా ముందుకు సాగితే ఎక్కడికైనా చేరవచ్చని విజిత్ భార్గవ్ కథ స్పష్టంగా చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh


