స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి


. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు
. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉగాది పచ్చడి ప్రసాదాన్ని సేవించిన అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పంచాంగ శ్రవణం చేశారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం గావించారు. అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పచ్చడి మన జీవితాలను ప్రతిబింబిస్తుందని, షడ్రుచుల తరహాలోనే జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయని, పండుగలు ఆరోగ్య కరమైన జీవనశైలిని నేర్పుతాయన్నారు. పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉందని…వాస్తు లాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారం లాంటి ఆచారాలు ఇలాంటి వేనని సీఎం అన్నారు. యోగా, నేచురోపతి లాంటి వైద్యం కూడా ప్రకృతి నుంచి వచ్చిందేనని, ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యం అవుతుందన్నారు. నేలను, ప్రకృతిని, నీటిని ఆరాధిస్తామని, దానిని అందిపుచ్చుకుని నీటిని పరిరక్షించేలా నీటి భద్రత విధానాన్ని తీసుకువచ్చామన్నారు. తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేలా నీటి యాజమాన్యం చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం వేసవి వచ్చినా రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 65 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. అందుకే మే 15 నాటికే నారుమళ్లు వేసుకోవాలని ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రిగా మూడో మారు గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం తనకు దక్కిందని, ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇప్పటి వరకూ రూ.1943 కోట్ల రూపాయలు ఇచ్చామని, గత పాలకులు పైసా కూడా వారికి ఇవ్వలేదన్నారు. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలని, గోదావరి పుష్కరాలకంటే ముందు ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు.
విదేశాల్లో మన సంస్కృతికి తెలుగువారే బ్రాండ్ అంబాసిడర్లు
సమీప భవిష్యత్తులో పూర్తిస్థాయి సాంకేతికతతో పాలన జరిగే అవకాశం ఉంటుందని, వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు ఇలా వేర్వేరు పరిస్థితులు అప్పటికప్పుడు అధ్యయనం చేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చేసిందన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలు నేర్పే విలువలను గౌరవించాలని, ఇక్కడ కంటే విదేశాల్లోని ప్రవాస తెలుగు వారు వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారన్నారు. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టటమే తన సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని ప్రాజెక్టు ద్వారా ముఖ్యమైన ముందడుగు వేశామన్నారు. 2024 కంటే ముందు ఎవరూ సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి లేదని.. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసం, దారుణాలు జరిగాయని ఆక్షేపించారు. మన దేశంలో ఉమ్మడిగా అంతా కలిసి ఉండే సంప్రదాయం ఉందని.. కొందరు స్వార్ధంతో తల్లికి, చెల్లెలికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు కూడా ఉన్నారని వైసీపీ అధినేతనుద్దేశించి విమర్శించారు.
పీ`4తో పేదరిక నిర్మూలన
సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారిని పేదరికం నుంచి బయటపడేసేలా జీరో పావర్టీ కార్యక్రమం పీ4 చేపట్టామని అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా దీనిని అమలు చేస్తున్నట్టు వివరించారు. కూటమి ప్రభుత్వం యువతకు హామీ ఇచ్చినట్టుగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంకల్పం చేశామన్నారు. ఉగాదిని పురస్కరించుకుని 10,060 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ జారీ చేశామని తెలిపారు. మే 15 నుంచి అక్టోబరు వరకూ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. గత 21 నెలల్లో 15,940 మంది టీచర్లకు మెగాడీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, 5757 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలు చేశామన్నారు. ఇప్పటి వరకూ 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇక ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. పరాభవ నామ సంవత్సరంలో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిచెప్పేలా సంకల్పం చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.
విశ్వనగరిగా అమరావతి: మాడుగుల నాగఫణిశర్మ
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వం సంకల్పించిన ప్రతీదీ ఫలిస్తుందని, లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. అందుకే ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని.. రాష్ట్రానికి ప్రభుత్వానికి ఆర్ధిక ప్రగతి ఉంటుందని స్పష్టం చేశారు.అనంతరం టీటీడీ పంచాంగం, వ్యవసాయ పంచాంగంతో పాటు సాంస్కృతిక శాఖ క్యాలండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందించారు. సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవ రంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలను సీఎం అందించారు. 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *