స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు


అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా

కాలియాబోర్(అసోం): తమ పార్టీ స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని, చొరబాటుదారులను సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా తరఫున గురువారం కాలియాబోర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని బీజేపీ అగ్రనేత ఆరోపించారు. అసోం స్థానిక ముస్లింలకు బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తాము వ్యతిరేకిస్తోంది చొరబాటుదార్లను మాత్రమేనని వక్కానించారు. బీజేపీ, ఏజీపీ ఎన్నికల పొత్తును ఆయన సూర్యచంద్రులతో పోల్చారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోవాలన్న పగటి కలలను రాహుల్ గాంధీ విరమించుకోవాలంటూ చురకలు అంటించారు. ప్రపంచ ప్రసిద్ధ కజిరంగా జాతీయ పార్క్‌ను చొరబాటుదార్లకు అప్పగించారంటూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను, ఆక్రమణదారులను అక్కడి నుంచి ఖాళీ చేయించిందని అమిత్ షా తెలిపారు. ఈ చర్యను సాకుగా చూపి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. అసోంలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *