. పీ`4తో అసమానతలు తగ్గింపునకు కృషి
. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక కేటాయింపులు
. సామాజిక సమానత్వమే లక్ష్యం
. సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సామాజిక సమానత్వమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలు అన్నిటా ప్రాతినిధ్యం వహించేలా సామాజిక సాధికారత సాధించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. బడ్జెట్‌లో సంక్షేమ శాఖల కేటాయింపులపై శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్‌డీఏ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వీటితో పాటు అన్ని వర్గాలకూ గతంలో కంటే మరింత అదనంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో పథకాలతో పాటు చేనేత కార్మికులకు కూడా ఉచిత విద్యుత్ లాంటి సంక్షే మాన్ని అందించి న్యాయం చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రిజర్వేషన్లు పెంచి అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోందని సీఎం తెలిపారు. బీసీ రక్షణ చట్టం ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని… అదే విధంగా బీసీల్లో ఉన్న కొందరు ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారు… వీటిపై ఇప్పటికే చేసిన బిల్లులను కేంద్రానికి కూడా పంపాం. వాటిని ఫాలోఅప్ చేస్తున్నామని సీఎం చెప్పారు. ‘శాసన సభలో ఉన్న మనపై ఎంతో నమ్మకం ఉంచి ప్రజలు ఓట్లు వేశారు. 94 శాతం స్ట్రైక్ రైట్‌తో ఎన్డీఏకు సీట్లు ఇచ్చారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కోవాలి. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను గత ప్రభు త్వం 24 శాతానికి తగ్గించింది. గత ప్రభుత్వం తగ్గించిన రిజర్వేషన్లు మళ్లీ 34కు పెంచేందుకు వన్ మెన్ కమిటీ వేశాం.’ అని చెప్పారు.
బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపులు పెంచాం
చౌక దుకాణాల ద్వారా వినియోగదారులకు మరింత సమర్థంగా సరకులు అందించేందుకు ప్రణాళిక చేయటంతో పాటు సక్రమంగా చేరవేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలను సాంకేతికత సాయంతో అనుకున్న సమయానికే చేరేలా చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులున్నా రూ.3.32 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ఈ బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపులు గతం కంటే పెంచామని… కేటాయించిన మొత్తాలను ఆ వర్గాలకే ఖర్చు చేసేలా చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రతి వర్గాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, ప్రజల ఆదాయాలను పెంచి జీవనప్రమాణాలు మెరుగుపరుస్తామన్నారు.
భావితరాలపైనే మా దష్టి
ప్రభుత్వ దృష్టి అంతా భావి తరాల భవితవ్యంపైనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రాథమిక పాఠశాల వరకూ బలోపేతం చేశాం. రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యను అందిస్తున్నాం. పౌష్టికాహారంతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేసి ఆదాయం పెంచడంతో పాటు సుపరిపాలన అందిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు చెప్పాం. నాడు చెప్పినట్లు గానే నేడు ముందుకెళుతున్నాం. పీపీపీ ద్వారా గతంలో సంపద సృష్టికి ముందుకెళ్లాం. పీపీపీ విధానంలో రోడ్లు, విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక వసతులు కల్పన జరిగింది. వీటితో సంపద పెరిగి, మెరుగైన వసతులు ఏర్పడినా అసమానతలు తగ్గలేదు. ఆర్థిక తారతమ్యాలు తగ్గించేందుకు పీ4 విధానాన్ని తీసుకొచ్చాం. 10 లక్షల బంగారు కుటుంబాలను 1 లక్ష మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ఏ కార్యక్రమంలోనైనా ఫలితాలు వెంటనే రావు. అసమానతలు తగ్గించేందుకు పీ4 మించి కార్యక్రమం మరొకటి ఉండదు. కొందరికి ఉద్యోగాలు ఉండవు. ఇంకొన్ని వర్గాలు కూలీ పని చేస్తే తప్ప పూట గడవదు. అలాంటి వారిని ఆదుకుని పైకి తీసుకురావాల్సి ఉంది. 2047కు భారత్ అగ్ర దేశంగా తయారవుతుంది. వికసిత్ భారత్‌గా తయారయ్యేనాటికి అసమానతలు ఉండటం మంచిది కాదు. ఇది కేవలం పబ్లిక్ పాలసీల వల్లే సాధ్యం అవుతుంది. చట్టసభల్లో ఉన్న మనమందరం కృత నిశ్చయంతో పని చేస్తే ఇది కష్టం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నేను ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి 1996-1997లో ఎస్సీ వర్గీకరణ చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కాపాడ లేకపోయాయి. ఇప్పుడు మళ్లీ వర్గీకరణ చేసి ఎస్సీల్లో కూడా సామాజిక న్యాయం చేసిన ఘనత మాది. గిరిజనుల కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ని కూడా గత పాలకులు కాపాడలేకపోయారు. దీంతో ఆ జీఓ నంబర్ 3ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆచరణతో పాటు అందరికీ ఆమోద యోగ్యంగా జీఓ నంబర్ 3 ఉండాలి. అందుకే సమావేశాలు ఏర్పాటు చేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. మహిళలు సాధికారత సాధిస్తే కుటుంబమే కాకుండా సమాజం కూడా సాధికారత సాధిస్తుంది. అగ్రవర్ణాల్లో పుట్టడమే మేం చేసిన పాపమా అని ఆ వర్గంలోని పేదలు బాధపడుతున్నారు. వారిని కూడా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. పేదలు ఎక్కడున్నా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇది బలహీన వర్గాల ప్రభుత్వం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.


