సీపీఐ వైపే ప్రజల మొగ్గు – Visalaandhra


. కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం మాదే
. డబ్బుతో చేసే రాజకీయం శాశ్వతం కాదు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని

విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదని, తాత్కాలిక ప్రయోజనాలు కనిపిస్తాయే తప్ప ప్రజల్లో నిజమైన విశ్వాసాన్ని పొందలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొందరు డబ్బు బలం, అహంకారంతో రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజల పక్షాన నిలిచే సీపీఐని దెబ్బ దెబ్బతీయటం ఈ ప్రాంతంలో ఎవరితరం కాదని స్పష్టం చేశారు. ఈ నెల 11 వ తేదీ బుధవారం జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన వివరించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పీఠాన్ని ప్రజల మద్దతుతో సీపీఐ కైవసం చేసుకోబోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, ఈ విషయం స్థానిక ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. కేవలం సంపాదన కోసం రాజకీయాలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని, లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సంకటంలో పడుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి వచ్చే నాయకులు… పీఠం ఎక్కిన తర్వాత అవినీతి, అక్రమాలకు పాల్పడతారని, ప్రజల శ్రేయస్సు ఏమాత్రం పట్టించుకోరని స్పష్టం చేశారు. అందుకే ప్రజలు విజ్ఞత ప్రదర్శించి సీపీఐ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రెండున్నర దశాబ్దాలుగా ఎన్నికలు లేని పాల్వంచకు ఈ దఫా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్ప్పుడు నెరవేర్చామన్నారు. కొత్తగూడెంను మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తామని ఆనాడు చెప్పిన విధంగానే చేశామన్నారు. కొందరు ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు తాను విశేష కృషి చేసి సఫలమైనట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాల్వంచలో ఎర్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దశాబ్దాలుగా ఎదురుచూసిన బైపాస్ రోడ్లు కూడా త్వరలో నిర్మాణం కాబోతున్నాయన్నారు. ఒక బైపాస్ రోడ్డు కోసం రూ.500 కోట్లు కేటాయించగా, మరో రోడ్డు కోసం రూ.150 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ను ప్రజలు సీపీఐకి కట్టబెడితే హైదరాబాద్ నగరం తరహాలో తీర్చిదిద్దేందుకు తాను శాయశక్తుల కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలను ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా కొత్తగూడెంలో సీపీఐని ఓడించలేరని స్పష్టం చేశారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి సీపీఐ అభ్యర్థులను గెలిపించుకోవాలని, తద్వారా సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *