పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్‌కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు నితీశ్ వారసుడు ఎవరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నారని, త్వరలోనే ఈ నిర్ణయాన్ని జేడీయూ అధికారికంగా ప్రకటిస్తుందని రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. తన కుమారుడు రాజకీయాల్లోకి రావడాన్ని నితీశ్ కూడా అంగీకరించారు. నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టొచ్చని తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి బలం 202గా ఉంది. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ లెక్కన నాలుగు నుంచి ఐదు ఎగువసభ సీట్లు కూటమికి దక్కనున్నాయి.
The post సీఎం నితీశ్ రాజీనామా? appeared first on Visalaandhra.


